కారం కన్నా ఘాటుగా ‘కర’ నష్టాలు

ధనుష్ చాలా గొప్పగా ప్రమోట్ చేసుకున్న ‘కర’ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. తీవ్ర నష్టాలు తప్పేలా లేవని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. కోలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి వారం పూర్తయ్యేనాటికి కర సుమారు నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ లెక్కలో చూసుకుంటే ఇది డిజాస్టర్ వైపు పరుగులు పెడుతున్నట్టే. ఎందుకంటే చెన్నై మీడియా కథనాల ప్రకారం దీనికి పెట్టిన బడ్జెట్ ఎనభై కోట్ల దాకా ఉందట. ఓటిటి డీల్ వల్ల భారీ ముప్పు తప్పిందని అంటున్నారు.

వరసగా ధనుష్ చేస్తున్న సీరియస్ సినిమాలు తన మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అణిచివేత ఉన్న కథలకు ప్రాధాన్యం ఇస్తూ, ఇంటెన్స్ పేరుతో ఒకే తరహా ఫార్ములాని అసురన్ నుంచి పదే పదే రిపీట్ చేస్తున్న ఈ టాలెంటెడ్ హీరో ఇకనైనా వాస్తవంలోకి రావాలి. రెండున్నర గంటలు మొహం గుంభనంగా పెట్టేసి ఎమోషన్ పేరుతో సెంటిమెంట్ అతిగా రుద్దేస్తే ఏ భాషలో అయినా తిరస్కారం తప్పదు. కర దానికి మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే ఇడ్లి కొట్టు లాగే కర ఇక్కడ వాషౌట్ అయిపోయింది. చాలా సెంటర్లలో వీకెండ్ తర్వాత డెఫిషిట్లు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం తప్ప ప్రత్యేకంగా ఎలాంటి ప్రమోషన్లు చేయకపోవడం ప్రభావం చూపించింది. కొన్ని చోట్ల అసలీ సినిమా విడుదలైన సంగతే కామన్ ఆడియన్స్ కి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ లెక్కన ధనుష్ ఎక్కడి నుంచి ఎక్కడికి డౌన్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమాగా అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మమ్ముట్టి ఒక ప్రధాన పాత్ర పోషిస్తుండగా సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు సగానికి పైగానే అయిపోయిందట. ఇంత క్రేజీ కాంబినేషన్ అంటే సబ్జెక్ట్ ఏదో ప్రత్యేకంగా ఉండొచ్చు. ఈ ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అయినా ధనుష్ ఫ్లాపుల ప్రవాహాన్ని అడ్డుకుంటుందేమో చూడాలి.