CM కాక ముందే సినిమాల హడావిడి

తమిళనాడు రాజకీయాలు ఏ సస్పెన్స్ థ్రిల్లర్ కు తీసిపోని రేంజ్ లో మీడియాకు మంచి మసాలా కంటెంట్ ఇస్తున్నాయి. తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ సీఎం ప్రమాణస్వీకారం వాయిదా పడ్డాక అభిమానులు పెద్ద షాక్ లో ఉన్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు ఎలాగూ టైం ఇస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదనుకుంటున్న టైంలో హఠాత్తుగా జరిగిన పరిణామాలు టివికె పార్టీని పెద్ద ఇరకాటంలో పడేశాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఫ్యాన్స్ ప్రపంచం మరొకటి ఉంది.

ఎలాగూ విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి ఆ ఆనందాన్ని థియేటర్లో సెలెబ్రేట్ చేసుకుందామనే ఉద్దేశంతో తమిళనాడులో మొన్నటి నుంచే మెర్సల్, తేరి తదితర స్పెషల్ షోలు వేస్తున్నారు. అభిమానుల ఎమోషన్ ని క్యాష్ చేసుకుంటున్న వైనం చూస్తున్నాం. ఇది అక్కడికే పరిమితం కాలేదు. మెర్సల్ డబ్బింగ్ వెర్షన్ అదిరిందిని హైదరాబాద్ లో స్క్రీనింగ్ చేస్తుంటే ఇక్కడ కూడా కొన్ని షోలు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. అసలు ట్విస్టు మరొకటి ఉంది.

కేవలం విజయ్ ఫ్యాన్స్ ని మాత్రమే ప్రమోట్ చేస్తే పనవ్వదని గుర్తించిన డిస్ట్రిబ్యూటర్లు అదిరింది సినిమాతో పాటు మహేష్ బాబు క్లిప్స్, సాంగ్స్ వేస్తామని ఊరిస్తూ ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విజయ్, మహేష్ బాబుల మధ్య ఏ బంధం లేకపోయినా కేవలం కలెక్షన్ల కోసం వేస్తున్న ఎత్తుగడ ట్రాప్ లో ఫ్యాన్స్ పడుతున్నారు. అక్కడ చెన్నైలో విజయ్ రాజకీయ చదరంగంలో పావులా మారిపోయి నలుగుతుంటే ఇక్కడ రీ రిలీజు హడావిడి ఇంకోలా ఉంది.

అసలు ఫ్యాన్స్ కోరుతున్నది ఇది కాదు. విజయ్ ముఖ్యమంత్రి కావడం కొన్ని రోజులు ఆలస్యం కావొచ్చేమో కానీ ల్యాబ్ లో నాలుగు నెలలుగా మగ్గుతున్న జన నాయకుడుని బయటికి తేవాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మే 27 విడుదల తేదీ చక్కర్లు కొడుతోంది. నిర్మాణ సంస్థ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. విజయ్ కొంచెం ఫ్రీ అయ్యాక ఆయన అనుమతితో అనౌన్స్ మెంట్ ఇస్తారు. ఇంకో ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి ఆలోగా ఏమేం జరుగుతాయో చూడాలి.