స్వయంభు సంగతి ఎప్పుడు తేలుతుంది

నిఖిల్ కొత్త సినిమా స్వయంభు నుంచి ఇప్పటిదాకా ఒక టీజర్, లిరికల్ సాంగ్ వచ్చేశాయి. బాగానే రీచ్ అయ్యాయి. మరీ వైరల్ అయ్యే స్థాయిలో అని కాదు కానీ ఉన్నంతలో ఆడియన్స్ ని చేరువ కావడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే పలు విడుదల తేదీలు అనుకుని వాయిదా వేసుకుంటూ వచ్చిన టీమ్ ఇప్పటికీ కొత్త డేట్ నిర్ణయించలేదు. ప్రమోషన్లు చేస్తున్నారు కానీ ఎక్కడా తేదీని ప్రస్తావించడం లేదు. అంటే ఇంకా లాక్ కాలేదని అర్థమవుతోంది.

స్వయంభు ప్రస్తుతం ఫైనల్ కాపీని సిద్ధం చేసే పనిలో ఉందని ఇన్ సైడ్ టాక్. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్రతీదీ డబుల్ చెక్ చేసుకుంటున్నారట. టీజర్ టైంలో వచ్చిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా నాణ్యతను ఫిక్స్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ లో ఏ పొరపాటు జరిగినా దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో హరిహర వీరమల్లు సినిమా, విశ్వంభర టీజర్ కొచ్చిన స్పందన చూశాక అందరికీ అర్థమయ్యింది.

మరో ముఖ్యమైన ట్విస్ట్ ఏంటంటే స్వయంభుకి ఇంకా ఓటిటి పార్ట్ నర్ లాక్ కాలేదని వినికిడి. నిర్మాత కోరుకున్న రేట్ కన్నా తక్కువ ఆఫర్ రావడంతో కొద్దిరోజులు వేచి చూడాలని ఆగారట. ఈ మధ్య ఓటిటిలు హీరో చిన్నా పెద్దా అని చూడకుండా కంటెంట్ మీద బజ్ ఎంత ఉంది., ప్రాజెక్టు మీద ఎంత మొత్తంలో బిజినెస్ జరుగుతోందనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఆ భరోసా కనక స్వయంభు టీమ్ ఇవ్వగలిగితే డీల్స్ త్వరగా క్లోజ్ అవ్వొచ్చు.

ఈ ప్యాన్ ఇండియా మూవీ హిట్ కావడం నిఖిల్ కు చాలా అవసరం. ఎందుకంటే రెండేళ్లకు పైగా దీని కోసం చాలా కష్టపడ్డాడు. ఒళ్ళు హూనం చేసుకుని మేకోవర్ పరంగా ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే నిఖిల్ కెరీర్ కి ఇదో బాహుబలి లాంటిది. దర్శకుడు భరత్ కృష్ణమాచారికి అనుభవం తక్కువైనా కథ మీద నమ్మకంతో ఇంత రిస్క్ తీసుకుని భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన స్వయంభుకి రవి బస్రూర్ సంగీతం అందించారు.