యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం.. సరిపోదా శనివారం. తన కెరీర్లో ఎక్కువ నష్టాలు మిగిల్చిన చిత్రమేమో అంటే సుందరానికి. ఈ రెండు చిత్రాల్లోనూ నానినే హీరో. సరిపోదా శనివారం కథ కొంచెం కొత్తగా ఉంటూనే.. హీరో ఎలివేషన్లు, మాస్ అంశాల మీద నడుస్తుంది. కాబట్టే దానికి బాక్సాఫీస్ దగ్గర మంచి రీచ్ వచ్చింది. వసూళ్లు అదిరిపోయాయి.
కానీ అంటే సుందరానికి పక్కా క్లాస్‌గా, చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ ప్రేక్షకులకు అది అంతగా రుచించలేదు. బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఐతే అంటే సుందరానికి సినిమాను విపరీతంగా ఇష్టపడే ప్రేక్షకులు లేకపోలేదు. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒక వర్గం బాధ పడుతూ ఉంటుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయకు కూడా నానితో చేసిన రెండు చిత్రాల్లో అంటే సుందరానికినే ఇష్టమట. రైటర్‌గా తాను ఎక్కువ సంతృప్తి చెందిన చిత్రం అదే అని ఒక ఇంటర్వ్యూలో వివేక్ వెల్లడించాడు.
సరిపోదా శనివారం బాగా ఆడినా సరే.. రైటర్‌గా తనకు అది పూర్తి సంతృప్తినివ్వలేదని.. కానీ అంటే సుందరానికి విషయంలో తనలోని ఉత్తమ రైటర్ బయటికి వచ్చాడని అనుకుంటానని వివేక్ ఆత్రేయ తెలిపాడు. ఇక తాను డెడ్ లైన్ల మధ్య పని చేయాలంటే చాలా ఒత్తిడికి గురవుతానని.. తన రైటింగ్ కూడా దెబ్బ తింటుందని.. సరిపోదా శనివారం సినిమా స్క్రిప్టు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో తాను ఇబ్బంది పడి వేరే రైటర్లను ఆశ్రయించాల్సి వచ్చిందని వివేక్ ఆత్రేయ వెల్లడించాడు.
మరోవైపు తన కెరీర్లో తొలి బ్రేక్ ఇచ్చిన బ్రోచేవారెవరురా రిలీజ్ తర్వాత తనకు ఎదురైన అనుభవాల గురించి వివేక్ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఆ సినిమా హిట్టవగానే తనకు పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్సులు వచ్చాయని, ఆ మొత్తం కోటి రూపాయలు అయిందని.. ఒక్కసారిగా తన బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బులు చూసేసరికి తాను షేక్ అయిపోయానని వివేక్ తెలిపాడు.
నిజానికి అప్పటికి తన దగ్గర స్క్రిప్టులేమీ లేవని.. కానీ ఆ డబ్బులు తనలో బాధ్యతను తీసుకొచ్చి, తర్వాత కథలు రాయడం మొదలుపెట్టానని వివేక్ వెల్లడించాడు. ఈ యువ దర్శకుడు తన తర్వాతి సినిమాను నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates