అవును.. దళపతి విజయ్ ఏడ్చేశాడు. అవేమీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు వచ్చిన ఆనంద భాష్పాలు కావు. తన కెరీర్ ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మరణించిన బాధతోనే విజయ్ ఏడ్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి.చౌదరి.
తెలుగు, తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన చౌదరి.. మంగళవారం హఠాత్తుగా కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్న ఆయన.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఆయన పార్థివ దేహాన్ని తమిళ సినీ ప్రముఖులందరూ సందర్శించారు. ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమవుతూ.. చాలా హడావుడిగా ఉన్నప్పటికీ విజయ్ వీలు చేసుకుని వచ్చి ఆర్.బి.చౌదరికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
చౌదరి పార్థిక దేహానికి నివాళి అర్పించాక ఆయన తనయుడు జీవాను హత్తుకుని ఓదార్చిన విజయ్.. బోరును విలపిస్తున్న జీవాను చూసి, తానూ ఏడ్చేశారు. విజయ్ కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్‌కి ఆర్.బి.చౌదరితో గొప్ప అనుబంధం ఉంది. 90వ దశకంలో హీరోగా ఓ మోస్తరు స్థాయిలో ఉన్న విజయ్ పెద్ద స్టార్‌గా ఎదగడంలో చౌదరి పాత్ర కీలకం.
ఆయన ప్రొడ్యూస్ చేసిన పూవె ఉనక్కాగ (తెలుగులో శుభాకాంక్షలు), లవ్ టుడే (సుస్వాగతం), తుల్లాదమనం తుల్లుం (నువ్వు వస్తావని), ఉనక్కాగ ఎల్లాం ఉనక్కాగ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయి విజయ్ రేంజి మార్చేశాయి. ఆ కృతజ్ఞత విజయ్ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాడు.
చౌదరి మీద పలు సందర్భాల్లో తన అభిమానాన్ని చాటిన విజయ్.. ఇప్పుడు ఎంతో హడావుడిలో కూడా వచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. చౌదరి ఈ వయసులోనూ సినిమాల నిర్మాణంలో యాక్టివ్‌గానే ఉంటూ వచ్చారు. గత ఏడాది కూడా ఆయన మారీశన్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates