మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు రోజుల ముందే ఆపేయడంతో ఇక వస్తుందని అనుకోవడానికి లేదు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి సామ్ భర్త రాజ్ నిడిమోరు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్నారు. షూటింగ్ ఎప్పుడో అయిపోయి ఫస్ట్ కాపీ దాదాపు సిద్ధమైన టైంలో హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం ఒకరకంగా చెప్పాలంటే దెబ్బే.

ఎందుకంటే జూన్ 4 పెద్ది వస్తుంది. దానికి వారం ముందు ఆ తర్వాత ఎవరూ రిలీజులు పెట్టుకోరు. హిట్ టాక్ వస్తే దాని సునామిని తట్టుకోవడం కష్టం. అందుకే జూన్ 5 షెడ్యూల్ చేసిన సత్యదేవ్ రావు బహదూర్ ను వాయిదా వేసే ఆలోచనలో పడ్డారు ఛాయ్ బిస్కెట్ బృందం. దీనికి మహేష్ బాబు కీలక నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. సో చరణ్ తో క్లాష్ అవ్వడానికి సమంత ససేమిరా అంటుంది కాబట్టి జూన్ మూడో వారం లేదా జూలైకి వెళ్ళిపోవాలి.

ఎలా చూసిన సమంత ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టు అయ్యింది. ఎందుకంటే థియేటర్లకు ఫీడింగ్ లేక అల్లాడిపోతున్న టైంలో మా ఇంటి బంగారం కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దీని బడ్జెట్ కు తగ్గట్టు కలెక్షన్లు వచ్చి లాభాలు తోడయ్యేవి. ఓ బేబీలో లేని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉండటం మాస్ వర్గాలకు చేరువ చేస్తుంది. ఎలాగూ మే 14 సూర్య వీరభద్రుడు రావడం డౌటే అంటున్నారు. ఇది సామ్ తమిళ వెర్షన్ కు హెల్ప్ అయ్యేది.

పెద్ది జూన్ 4 రాదనే ధీమాతోనే మే 15 డేట్ ని లైట్ తీసుకున్నారని, తీరా రామ్ చరణ్ సినిమాని అదే తేదీకి ఫిక్స్ చేయడంతో సామ్ టీమ్ షాక్ తిందని ఇన్ సైడ్ టాక్. కంబ్యాక్ ఆశలన్నీ సమంత మా ఇంటి బంగారం మీదే పెట్టుకుంది. తనతో బాగా సింక్ ఉన్న నందిని రెడ్డికే ఛాన్స్ ఇచ్చింది. టీజర్ గట్రా చూస్తే ఆసక్తికరంగానే ఉంది. అయినా ప్యాన్ ఇండియా మూవీస్ వాయిదా పడటంలో న్యాయముంది కానీ ఇప్పుడీ రూట్లో మా ఇంటి బంగారం లాంటి మీడియం సినిమాలు కూడా వెళ్లడం అస్సలు బాలేదు.