ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్ లాంటి చాలా కొద్ది మంది మాత్రమే 80 ఏళ్లు పైబడ్డా సినిమాలు తీస్తుంటారు. ఐతే ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఎవరికీ సాధ్యం కాని విధంగా మన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. ఏకంగా 94 ఏళ్ల వయసులో సినిమా తీసి ఔరా అనిపించారు.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వయసులోనూ ఎంతో ఓపికతో కేవలం 4 నెలల్లోనే సినిమా తీసి ఔరా అనిపించారు సింగీతం. పాత తరం దర్శకుడు కదా.. కంటెంట్ అందుకు తగ్గట్లే ఉంటుందేమో అనుకుంటే.. కంటెంపరరీ కథతో ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగే సినిమా తీశారని టీజర్ చూస్తే అర్థమైంది.
‘సింగ్ గీతం’ చిత్రంతో సింగీతం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న దర్శకుల్లో సినిమా తీసిన అతి పెద్ద వయస్కుడు సింగీతమే. ఇప్పటిదాకా ఆ రికార్డు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్‌వుడ్ పేరిట ఉంది. ఆయన 2024లో ‘జొరోర్ 2’ సినిమా తీశారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఈస్ట్‌వుడే. ఆ సినిమా తీసే సమయానికి ఆయన వయసు 93 ఏళ్లు.
సింగీతం ఆయన కంటే ఒక సంవత్సరం పెద్ద వయసులో ‘సింగ్ గీతం’ తీశారు. ఐతే మొత్తంగా అత్యంత పెద్ద వయసులో ఫీచర్ ఫిలిం తీసిన ఘనత పోర్చుగీస్ దర్శకుడు మానువల్ డి ఎలోవీరా పేరిట ఉంది. ఆయన 103 ఏళ్ల వయసులో ‘జెబో అండ్ ద షాడో’ అనే సినిమా తీశారు. ఈ సినిమా 2012లో వచ్చింది. ఎలోవీరా ఇంకో మూడేళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో మరణించారు.
ఇప్పుడు జీవించి ఉన్న దర్శకుల్లో అత్యంత పెద్ద వయసులో సినిమా తీసిన ఘనత మాత్రం సింగీతం సొంతం చేసుకున్నారు. మరి ఈ ఉత్సాహంలో సింగీతం ‘సింగ్ గీతం’ తర్వాత కూడా సినిమా తీసి, తన రికార్డును తానే బద్దలు కొడతారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates