లీక్ చేయలేదు… అయినా ఎడిటర్‌పై వేటు

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాగయన్’ థియేటర్లలో రిలీజ్ కాకముందే గత నెలలో ఆన్ లైన్లో లీక్ అయిపోవడం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. లీక్ అంటే ఏదో ఒకటి రెండు సీన్లు బయటికి రావడం కాదు. మొత్తంగా సినిమా సినిమానే హెచ్డీ క్వాలిటీతో బయటికి వచ్చేయడంతో తమిళ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపడంతో పోలీసులు సీరియస్‌గా దీనిపై దృష్టిసారించారు.

లీక్ వెనుక ఉన్న ముగ్గురు వ్యక్తులను పట్టేసుకున్నారు. ఈ చిత్రంతో సంబంధం లేని ఒక అసిస్టెంట్ ఎడిటర్.. తనకున్న పరిచయాలతో ‘జననాగయన్’ ఎడిటింగ్ విభాగంలోకి వచ్చి సినిమాను కాపీ చేసుకుని వెళ్లి లీక్ చేసినట్లు వెల్లడైంది. ఆ వ్యక్తి గురించి బయటికి తెలిస్తే.. తన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పోలీసులు వివరాలు బయటపెట్టలేదు. మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.

ఐతే ఈ లీక్‌తో ఏ సంబంధం లేకపోయినప్పటికీ.. ‘జననాగయన్’ ఎడిటర్ ప్రదీప్ రాఘవన్‌ను సౌత్ ఇండియన్ ఎడిటర్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. సినిమాను లీక్ చేయకపోయినప్పటికీ.. నిర్లక్ష్యంగా ఉన్నందుకు బాధ్యుడిని చేస్తూ అతణ్ని సస్పెండ్ చేస్తున్నట్లు సంఘం ప్రకటించింది.

ఈ సినిమాను ఎడిటరే లీక్ చేశాడని గతంలో వార్తలు రాగా.. ఎడిటర్ సంఘం ఆ ఆరోపణలను ఖండిస్తూ రాఘవ్‌కు అండగా నిలిచింది. కానీ తన రూం నుంచే సినిమా లీక్ అయిందని, దీని వెనుక తన నిర్లక్ష్యం కూడా ఉందని గుర్తించి అతడిపై వేటు వేసింది. 

ఇదిలా ఉండగా.. తమిళనాట ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడైనా ‘జననాయగన్’కు మోక్షం లభిస్తుందేమో అని విజయ్ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభిస్తే మే తొలి రెండు వారాల్లో ఏదో ఒక డేట్ చూసి రిలీజ్ చేసేయడానికి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ రూపొందించాడు. తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’కి ఈ చిత్రం రీమేక్ అన్న సంగతి తెలిసిందే.