ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద సినిమాలను వేసవికి షెడ్యూల్ చేస్తున్నారు కానీ.. అవి డెడ్‌లైన్‌ను అందుకోలేక వాయిదా పడిపోతున్నాయి. ఈసారి కూడా పెద్ది, విశ్వంభర లాంటి చిత్రాలను వేసవికే అనుకున్నారు.
కానీ అవి ఈ సీజన్లో రావట్లేదు. ‘ది ప్యారడైజ్’ లాంటి క్రేజీ ఫిలిం కూడా వాయిదా పడిపోయింది. కనీసం ‘స్వయంభు’ లాంటి సినిమాతో అయినా లోటు తీర్చుకుందామంటే అది కూడా వేసవిలో వస్తుందో రాదో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చినా తీవ్ర నిరాశకు గురి చేసింది. మొత్తంగా ఈ ఏడాది వేసవిలో భారీ చిత్రాల హంగామా లేనట్లే.
ఐతే ఇలాంటి టైంలో చిన్న సినిమా అయినా సరే.. ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆశలు రేకెత్తిస్తోంది ‘జెట్‌లీ’. ఇది కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన సినిమా. ప్రస్తుతం తెలుగులో సత్యకు ఉన్న క్రేజ్ మరే కమెడియన్‌కూ లేదు. వెన్నెల కిషోర్ సైతం తనతో పోలిస్తే వెనుకబడిపోయాడు. ‘మత్తువదలరా-2’తో తన రేంజ్ మారిపోయింది. చిన్న చిన్న కామెడీ రోల్స్ చేసినా తనదైన శైలిలో నవ్విస్తున్నాడు.
‘మత్తు వదలరా-2’లో సింహా హీరో అయినా.. ఆ సినిమా అంత బాగా ఆడిందంటే సత్యనే కారణం. అందుకే తననే లీడ్ రోల్‌లో పెట్టి రితేష్ రాణా ‘జెట్‌లీ’ తీశాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో ఆసక్తి రేకెత్తించింది. ఈ చిత్రంతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తబోతున్నారనే ఆశలు కలిగాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
సత్యకు తోడు వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్ర చేయడంతో ఇద్దరూ కలిసి చేసే హంగామా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. యూత్ ఈ వేసవిలో తప్పక చూడాలనుకుంటున్న సినిమాల్లో ‘జెట్‌లీ’ ముందు వరుసలో ఉందనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఊహించని నంబర్స్ చూడొచ్చు. మున్ముందు సత్య మరిన్ని లీడ్ రోల్స్ చేసే రేంజిలో ఈ సినిమా హిట్ కావచ్చు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates