కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన యానిమేషన్ మూవీ ఇది. కన్నడ నుంచి వచ్చిన ఈ చిత్రం.. అక్కడ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ చేస్తే ఇతర భాషల్లోనూ అనూహ్యమైన ఆదరణ దక్కింది. కొన్ని వారాల తరబడి సినిమా ఇరగాడేసింది.

ఫుల్ రన్లో రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం రేపింది ‘మహావతార నరసింహ’. దీని దర్శక నిర్మాతలు పడ్డ కష్టానికి అద్భుతమైన ఫలితం దక్కింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ వేరే సంస్థ నుంచి తీసుకుని రిలీజ్ చేసి వాళ్లకు మంచి సపోర్ట్ ఇచ్చింది. తానూ మంచి లాభాలు అందుకుంది. ‘మహావతార నరసింహ’ వచ్చినపుడే ఈ ఫ్రాంఛైజీలో మరిన్ని యానిమేషన్ మూవీస్ రాబోతున్నాయంటూ వాటి టైమ్ లైన్‌ కూడా ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా ‘మహావతార పరశురామ్’ను ప్రకటించారు.

ఐతే మొన్న రిలీజ్ చేసిన ‘పరశురామ్’ గ్లింప్స్ పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా ఇందులో విజువల్స్ ఒరిజినల్‌గా అనిపించట్లేదని.. యానిమేషన్ చేసినట్లు లేవన్నది పెద్ద కంప్లైంట్‌గా కనిపిస్తోంది. ఈ గ్లింప్స్ కోసం ఏఐని ఉపయోగించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల పురాణాల నేపథ్యంలో ఈ తరహా ఏఐ వీడియోలు బోలెడన్ని వచ్చాయి. అవి సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంటాయి. మహావతార పరశురామ్ గ్లింప్స్ విజువల్స్ వాటిని పోలినట్లే ఉన్నాయి. యానిమేషన్ కష్టం ఏమి లేకుండా జస్ట్ ఏఐని వాడి గ్లింప్స్ వదిలేశారని.. ఎంతో క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ మూవీకి ఇలా చేస్తే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కానీ గ్లింప్స్ వరకు ఇలా చేసినా.. సినిమా విషయంలో టీం రాజీ పడకపోవచ్చని.. ప్రేక్షకులను గ్రాంటెడ్ గా తీసుకోరని.. కచ్చితంగా సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలాగే కంటెంట్ ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న మహావతార పరశురామ్ 2027 చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.