వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లతో కొరటాల శివ టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ ఆయన కెరీర్‌ను షేక్ చేసేసింది. ఆ చిత్రమే.. ఆచార్య. ఈ సినిమా మరీ దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో కొరటాల సామర్థ్యం మీద సందేహాలు కలిగాయి. అలాంటి ఫలితం తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ తన మిత్ర దర్శకుడిని నమ్మి ‘దేవర’ చేసే అవకాశమిచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకున్నప్పటికీ.. అది ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా కాదు.
అందుకే ‘దేవర’ సీక్వెల్ అనుకున్నంత వేగంగా ముందుకు కదల్లేదు. అసలు ఈ సినిమా ఉండదేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ఈ మధ్యే సీక్వెల్ పక్కా అని క్లారిటీ ఇచ్చాయి నిర్మాణ సంస్థలు. మరి ఆ చిత్రం ఎప్పుడు ముందుకు కదులుతుందో చూడాలి. కొంత కాలంగా కొరటాల ఆ సినిమా స్క్రిప్టు మీదే పని చేస్తున్నాడు.
ఐతే ఇప్పుడు ఆయనకు ఇంకో పని కూడా పడింది. కొరటాల సమర్పణలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లు సమాచారం. అది అజయ్ చివరి చిత్రం ‘మంగళవారం’ సీక్వెల్ అని సమాచారం. ‘మంగళవారం’ సినిమా రిలీజప్పుడే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు అజయ్.
కానీ తర్వాత ‘శ్రీనివాస మంగాపురం’ చేయాల్సి వచ్చింది. ఇది పూర్తయ్యాక మాత్రం ‘మంగళవారం-2’నే చేయబోతున్నాడు. తన మిత్రుడు, ‘దేవర’ నిర్మాత సుధాకర్ మిక్కిలినేని బేనర్లోనే ‘మంగళవారం-2’ చేయించడానికి సిద్ధమవుతున్నాడు కొరటాల. ఈ నేపథ్యంలో ‘మంగళవారం-2’ స్క్రిప్టు పర్యవేక్షణ బాధ్యత కూడా ఆయన చేతుల్లోనే ఉంది.
స్క్రిప్టు అప్రూవ్ చేసి, మేకింగ్ కూడా కొంత చూసుకోవాల్సి ఉంది. ‘దేవర-2’ పట్టాలెక్కడానికి చాలా టైం పట్టేలా ఉండడంతో ఆ లోపు ఆయన ‘మంగళవారం-2’ పనులు కూడా చూసుకోనున్నాడు. ఇంతకుముందు కొరటాల సమర్పణలో వచ్చిన ‘కృష్ణమ్మ’ ఆశించిన ఫలితాన్నందుకోలేదు. మరి ‘మంగళవారం-2’ ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates