ప్రపంచ పాప్ సంగీతంలో తన పేరిట ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజం మైకేల్ జాక్సన్. తన గానం.. తన నృత్యం.. తన మ్యూజిక్ కంపోజిషన్.. ప్రతిదీ ఒక అద్భుతమే. ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన సంగీతకారుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో సంగీతం ఉన్న ప్రతి దేశంలోనూ అతను సూపర్ స్టారే.
ఇండియాలో కూడా కోట్లాదిమంది అభిమానులున్నారు మైకేల్‌కు. తన గురించి తెలియని వాళ్లు యూట్యూబ్‌లోకి వెళ్లి రాండమ్‌గా ఏదో ఒక పాట చూసినా చాలు.. తన ఫ్యాన్ అయిపోతారు. మూన్ డ్యాన్స్ సహా ఎన్నో అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ముందుతరం సంగీత ప్రియులకు పిచ్చెక్కించేసిన అరుదైన ప్రతిభావంతుడు మైకేల్.
ఐతే 50 ఏళ్ల తక్కువ వయసులోనే అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన మైకేల్.. ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తాడు. 2009లో మైకేల్ చనిపోయిన కొన్ని నెలలకే అతడి జీవిత విశేషాలతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అది అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది.
ఐతే ఇప్పుడు మైకేల్ జాక్సన్ జీవితం మీద ఫుల్ లెంత్ సినిమా వస్తోంది. ఆ చిత్రమే.. మైకేల్. జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ఇందులో లీడ్ రోల్ చేయడం విశేషం. మైకేల్ జాక్సన్ పోలికలతో ఉండే అతను.. నృత్యాలతో సహా అన్ని విషయాల్లో తన మావయ్యను పర్ఫెక్ట్‌గా దించేసినట్లు కనిపిస్తున్నాడు ప్రోమోలు చూస్తే.
మూన్ వాక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాటను అనుకరిస్తూ చేసి సాంగ్ చూస్తే నిజంగా మైకేల్ జాక్సన్‌ను చూస్తున్నట్లే అనిపించింది అభిమానులకు. ఈ సినిమా వరల్డ్ వైడ్ మైకేల్ అభిమానులందరినీ తీవ్ర భావోద్వేగానికి గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంటోనీ ఫుక్వా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రెండేళ్లకు పైగా చిత్రీకరణ దశలో ఉన్న మైకేల్.. ఈ నెల 24న వరల్డ్ వైడ్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
చాలా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టగా.. రెస్పాన్స్ అదిరిపోతోంది. హైదరాబాద్‌లో వారం ముందే బుకింగ్స్ మొదలుపెడితే.. అల్లు సినిమాస్ డాల్బీ థియేటర్, ప్రసాద్ పీసీఎక్స్ లాంటి ప్రీమియం స్క్రీన్లలో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates