‘మమ్మీ’ అభిమానులకు దెయ్యం షాక్

ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1999లో విడుదలైన ది మమ్మీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రెండో భాగంగా వచ్చిన మమ్మి రిటర్న్స్ సైతం బ్లాక్ బస్టర్ అయ్యింది. జాకీ ఛాన్ ని తీసుకొచ్చి మమ్మీ 3లో నటింపజేస్తే అది మాత్రం అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. ఇదే సిరీస్ లో భాగంగా వచ్చిన ది స్కార్పియన్ కింగ్ లాంటివి కమర్షియల్ గా భారీ లాభాలు అందుకున్నాయి. తిరిగి రెండున్నర దశాబ్దాల తర్వాత కొత్త మమ్మీ వచ్చింది

లీ క్రోనిన్ ది మమ్మీ పేరుతో విడుదలైన ఈ మూవీ తాజాగా థియేటర్లలో అడుగు పెట్టింది. ముందు కథేంటో చూద్దాం. ఈజిప్ట్ దేశం కైరోలో ఉద్యోగం చేసుకునే ఛార్లీ కూతురు కేటీని ఒక మంత్రగత్తె ఎత్తుకుపోతుంది. వెతికి విసిగి వేసారిన ఛార్లీ దంపతులు అమెరికా వెళ్ళిపోతారు. ఎనిమిదేళ్ల తర్వాత కేటీ దొరికిందంటూ ఫోన్ వస్తుంది. అయితే విచిత్ర ప్రవర్తనతో భయం కలిగించే రూపంతో ఉన్న టీనేజ్ కేటీని ఇంటికి తీసుకొస్తారు. అక్కడి నుంచి నరకం మొదలవుతుంది. అదే అసలు స్టోరీ.

మమ్మీకి వీరాభిమానులు ఉండటానికి కారణం అందులో ఉండే యాక్షన్ ఎపిసోడ్లు, అద్భుతమైన గ్రాఫిక్స్, ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు, పురుగులు జంతువులు వగైరా. ఇవేవి కొత్త మమ్మీలో ఉండవు. ఎగ్జార్ సిస్ట్, అన్నాబెల్లె, చైల్డ్స్ ప్లే, కాంజురింగ్, ఈవిల్ డెడ్ లాంటి హారర్ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లకు ది మమ్మీ కొత్తగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా రొటీన్ ఫీలింగ్ ఇస్తుంది. మతిపోయే అసలు ట్విస్టులు సెకండాఫ్ లో చూపిస్తాడు దర్శకుడు లీ క్రోనిన్.

గుండె జబ్బు రోగులు, మహిళలు, చిన్న పిల్లలు ఏ మాత్రం చూడలేనంత దారుణంగా హారర్ నింపేశాడు దర్శకుడు. నాన్నమ్మను కేటీ చంపే సీన్, ఇంట్లో సెర్మనీ జరుగుతుండగా చెల్లితో కలిసి కేటీ చేసే విధ్వంసం, తన చిన్నప్పుడు ఈజిప్టు మమ్మీకి బలి ఇవ్వడం లాంటి సన్నివేశాలు సున్నిత మనస్కులు తట్టుకోలేరు. ఎంత జుగుప్సగా ఉన్నా పర్వాలేదు భరిస్తాం అనుకుంటే కొత్త మమ్మీని ట్రై చేయొచ్చు. ఈ సిరీస్ కల్ట్ ఫ్యాన్స్ మటుకు ఈ దెయ్యం షాకుకి దూరంగా ఉండటం మంచిది.