మాట తప్పినా హిట్ కొడితే చాలు

టాలీవుడ్ స్టార్ హీరోలు స్టేజ్ ఎక్కితే చాలు, ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలు పక్కా అని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చేస్తుంటారు. సినిమా ఆలస్యం కావడంతో కాస్త అసహనంగా ఉన్న అభిమానులను కూల్ చేయడానికి ఈ స్పీడ్ మంత్రం బాగానే పనిచేస్తుంది. కానీ గ్రౌండ్ లెవల్లో పరిస్థితి చూస్తే మాత్రం ఆ మాటలు నీటి మూటలనే మిగులుస్తున్నాయి. సినిమా మేకింగ్ స్టైల్ మారడం, విజువల్స్ కోసం ఏళ్ల తరబడి టైం తీసుకోవడం వల్ల హీరోలు చెప్పిన టైమ్‌లైన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి.

ఆర్‌ఆర్ఆర్ తర్వాత రెండేళ్లలో మూడు సినిమాలు చేస్తానని రామ్ చరణ్ మాటిచ్చారు. కానీ ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ‘గేమ్ ఛేంజర్’ తప్ప మరో రిలీజ్ లేదు. అది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఒక సినిమా రిజల్ట్ తేడా కొడితే, నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో హీరోలు మరింత జాగ్రత్త పడుతున్నారు. అందుకే పెద్ది సినిమా కోసం చాలా టైం తీసుకుంటున్నారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పుష్ప 2 తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. ఆ సినిమా భారీ సక్సెస్ సాధించినప్పటికీ, అట్లీ సినిమాతో పాటు ఇతర ప్రాజెక్టులు పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతోంది. పుష్ప 2 వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, బన్నీ నుంచి కొత్త సినిమా అప్‌డేట్ తప్ప రిలీజ్ ముచ్చట కనిపించడం లేదు. రిస్క్ చేయడం కంటే పక్కా కంటెంట్‌తో రావడం మేలనేది ఆయన ఆలోచన.

ప్రభాస్ మాత్రం ఈ విషయంలో మిగతా హీరోల కంటే కాస్త బెటర్ అని చెప్పాలి. ఆదిపురుష్ సమయంలో ఏడాదికి రెండు సినిమాలు ఇస్తానని చెప్పిన డార్లింగ్, అన్నట్టుగానే సలార్, కల్కి వంటి భారీ చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలోకి తెచ్చారు. అయితే ‘రాజా సాబ్’ వల్ల బ్రేక్ పడినా వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ప్రభాస్ తన మాటను నిలబెట్టుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు.

హీరోలకు స్పీడ్ పెంచాలని ఉన్నా, నేటి తరం ఆడియన్స్ టేస్ట్ వారిని అడ్డుకుంటోంది. ఒకప్పుడు రెండు ఫైట్లు, మూడు పాటలు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు సినిమా 80 శాతం నచ్చితేనే థియేటర్లకు జనం వస్తున్నారు. కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియా ట్రోలింగ్ దారుణంగా ఉంటోంది.

అందుకే తొందరపడి సినిమాలు రిలీజ్ చేసి డిజాస్టర్లు మూటగట్టుకోవడం కంటే, లేట్ అయినా లేటెస్ట్ గా రావడం మిన్న అనే ధోరణిలో మన స్టార్స్ ఉన్నారు. సినిమా బాగుంటే అది ఎంత లేట్ గా వచ్చినా ప్రేక్షకులు ఎగబడి చూస్తారు.

కంటెంట్ హిట్టయితే పాత మాటలు, ప్రామిస్‌లు ఎవరూ గుర్తుపెట్టుకోరు అనేది వాస్తవం. అందుకే మన హీరోలు కూడా మాట తప్పినా హిట్ కొడితే చాలు అన్నట్లుగా సైలెంట్ గా తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఫ్యాన్స్ సహనానికి పరీక్ష ఎదురవుతున్నా, బాక్సాఫీస్ వద్ద పక్కా రిజల్ట్ రావాలంటే ఈ మాత్రం టైం తప్పదు మరి.