పెద్ది… డేట్ ఎందుకు చెప్పలేదు?

అనుకున్నదే అయింది. ‘పెద్ది’ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించేశారు. ఐతే మార్చి నెలాఖరు నుంచి వాయిదా వేసినపుడు ఏప్రిల్ 30న రిలీజ్ అంటూ కొత్త డేట్ స్పష్టంగా చెప్పిన చిత్ర బృందం.. ఈసారి మాత్రం ఆ పని చేయలేదు. ఇప్పటికే రెండుసార్లు డేట్ మార్చుకున్న నేపథ్యంలో ఇంకోసారి డేట్ చెప్పి.. అటు ఇటు అయితే జనాల్లో పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోతామన్న భయం కావచ్చు. 

జూన్ నెలలో ఇంకో భారీ పాన్ ఇండియా సినిమా అయిన ‘టాక్సిక్’ రావాల్సి ఉంది. ఆ సినిమా విడుదల తేదీని అనుసరించే ‘పెద్ది’కి డేట్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. టాక్సిక్‌ను మార్చి 19 నుంచి వాయిదా వేసినపుడు.. కొత్త రిలీజ్ డేట్ జూన్ 4గా ప్రకటించారు. కానీ ఆ డేట్‌కు పక్కాగా సినిమా వస్తుందా అనే విషయంలో సందేహాలున్నాయి. ‘టాక్సిక్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థే.. విజయ్ చిత్రం ‘జననాయగన్’ను కూడా నిర్మించింది. 

ఆ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దాని రిలీజ్ విషయంలో చాలా చిక్కుముడులు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించుకుని ఏ తేదీన రిలీజ్ చేస్తారు అన్నదాన్ని బట్టే ‘టాక్సిక్’ విడుదల కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఈ రెండు చిత్రాల వ్యవహారం ఒక కొలిక్కి వస్తేనే.. ‘పెద్ది’ని ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది నిర్ణయం అవుతుంది. అందుకే ప్రస్తుతానికి జూన్ రిలీజ్ అని మాత్రమే చెప్పారు. 

ఈసారి డేట్ చెబితే పక్కాగా ఆ తేదీకి రావాల్సిందే కాబట్టి.. ఎందుకైనా మంచిదని ఆచితూచి వ్యవహరిస్తోంది చిత్ర బృందం. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థతో కలిసి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి.