దురంధర్ పోవాలని కోరుకున్న టాప్ డైరెక్టర్లు

ఒక భాష నుంచి ఆల్ టైమ్ హిట్ వస్తే.. ఆ ఇండస్ట్రీ అందుకు ఎంతో గర్విస్తుంది. ఆ సినిమా మాది అని గర్వంగా చెప్పుకుంటుంది. ‘బాహుబలి’ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ టాలీవుడ్ అలాగే గర్వించింది. ‘కేజీఎఫ్’ సినిమా సంచలనం రేపినపుడు శాండిల్‌వుడ్ కూడా అంతే ప్రౌడ్ ఫీలైంది. కానీ ‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాల విషయంలో మాత్రం బాలీవుడ్‌లో అలాంటి ఫీలింగ్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. నాలుగు నెలల ముందు ‘దురంధర్’ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. 

గత నెలలో విడుదలైన ‘దురంధర్-2’ అంతకుమించి విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం బాహుబలి, పుష్ప-2 చిత్రాలను అధిగమించి ఆల్ టైం ఇండియన్ టాప్-2 గ్రాసర్‌గా నిలిచింది. అయినా బాలీవుడ్ నుంచి ఆ చిత్రాన్ని అభినందిస్తూ బాలీవుడ్ ప్రముఖులు పోస్టులు పెట్టట్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు అనుకూలంగా తీశారు అనే ఒక ముద్ర వేసి బాలీవుడ్ ఆ సినిమాకు దూరంగా జరుగుతోందనే అభిప్రాయం కలుగుతోంది.

ఇలాంటి సమయంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన కునాల్ కోహ్లి.. ‘దురంధర్’ విషయంలో బాలీవుడ్ అగ్ర దర్శకుల కడుపు మంట ఎలా ఉందో బయటపెట్టారు. ‘దురంధర్’, ‘దురంధర్-2’ సినిమాలు సాధించిన విజయానికి గర్వించకపోగా.. ఆ సినిమా ఫ్లాప్ కావాలని బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కోరుకున్నట్లు ఆమిర్ ఖాన్‌తో ‘ఫనా’ సినిమా తీసిన కునాల్ వెల్లడించాడు.

ఇండస్ట్రీలో ఎవ్వరూ ‘దురంధర్’ సినిమాకు మద్దతుగా నిలవలేదని.. అయినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని వ్యాఖ్యానించాడు కునాల్. తాను కొంతమంది అగ్ర దర్శకులతో మాట్లాడానని.. వాళ్లు సోమవారానికి ఈ సినిమా పనైపోతుందని అన్నారని, కానీ ఆ సినిమా సోమవారం పడిపోకుండా బాగా ఆడిందని అన్నాడు.

సన్నీ డియోల్ సినిమా ‘బోర్డర్-2’ సినిమా కూడా ఫ్లాప్ కావాలని చాలామంది కోరుకున్నారని.. కానీ ఆ చిత్రం రూ.300 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాడు. దీన్ని బట్టి తాను చెప్పదలుచుకున్నది ఒక్కటే అని.. ఇండస్ట్రీ సపోర్ట్ చేసినా చేయకపోయినా పెద్ద విషయం కాదని.. సినిమాలు ఆడతాయని అతనన్నాడు.