జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్ క్లిప్పులు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాదు ఫుల్ మూవీ బయటికి వచ్చిందంటూ మరికొందరు ఆధారాలతో సహా స్క్రీన్ షాట్లు పెట్టేశారు. ఒక పైరసీ వెబ్ సైట్ ఏకంగా మేము నైతికతకు విలువిస్తూ ఆ ప్రింట్ షేర్ చేయడం లేదని గర్వంగా ప్రకటన ఇవ్వడం జోక్ అఫ్ ది సెంచరీగా చెప్పుకుంటున్నారు. అంటే లీకైన మాట నిజమని ఒప్పుకున్నట్టేగా.

అప్పటికప్పుడు నిర్మాణ సంస్థ లింకులను తొలగిస్తూ కాపీ రైట్ చర్యలకు పూనుకుంటున్నప్పటికీ చాలా డ్యామేజ్ జరిగిపోయింది. రకరకాల మార్గాల్లో షేరింగ్ కు తెగబడిన వాళ్ళ సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటోంది. అసలీ విషయం మీద అవగాహన లేని వాళ్ళు సైతం ఎక్స్, ఇన్స్ టాలో హడావిడి చూసి ప్రింట్ వెతికే పనిలో ఉన్నారంటేనే వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఆన్ లైన్ షేరింగ్ కట్టడి చేయొచ్చు కానీ అన్నింటిని నియంత్రించడం అసాధ్యం.

ఇప్పుడు కెవిఎన్ ప్రొడక్షన్స్ తీసుకోవాల్సిన చర్య ఒకటుంది. సెన్సార్ అధికారులను బ్రతిమాలో కాళ్ళు పట్టుకునో ముందైతే థియేటర్ రిలీజ్ చేయాలి. కానీ విజయ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోదు. అంటే ఏప్రిల్ 24 దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడీ విషయం తెలిసి ఓటిటిలు రేట్ గురించి ఎలాంటి బేరసారాలు ఆడతాయో ఊహించుకోవచ్చు. దర్శకుడు వినోత్ దయచేసి ఇలాంటి పైరసీలను ప్రోత్సహించొద్దు అంటూ వేడుకుంటున్నారు కానీ లాభం లేదు.

చెన్నై వర్గాల్లోనే ఇంకో టాక్ నడుస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఎవరో కావాలని లీక్ చేశారని, ఇందులో కొన్ని సీన్లు, ఎపిసోడ్లు విజయ్ కు పొలిటికల్ మైలేజ్ ఇచ్చేలా ఉండటంతో కావాలని ప్లాన్ చేసి ఉండొచ్చని అంటున్నారు. పోలీసులు, సైబర్ క్రైమ్ రంగంలోకి దిగింది. మూలలను వెతికే పనులను వేగవంతం చేసింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన జన నాయకుడులో మమిత బైజు ఒక ముఖ్య పాత్ర పోషించింది. బాలకృష్ణ భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ గా ఇది రూపొందింది.