ప్రదీప్ ఇమేజ్ సరిపోవడం లేదు

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ రూపంలో వరసగా మూడు వంద కోట్ల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తర్వాత వస్తున్న మూవీగా దీని మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండాలి. బుకింగ్స్ కూడా అలాగే జరగాలి. కానీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అంత ఊపు కనిపించడం లేదు. తమిళనాడులో ఎన్నికల జ్వరం పతాక స్థాయిలో ఉండటం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఇలా ఎందుకు జరుగుతోంది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని సమస్యలు ఉన్నాయి. దర్శకుడు విగ్నేష్ శివన్ ఒకప్పుడు సూర్య లాంటి స్టార్లను డైరెక్ట్ చేశాడు కానీ ఇప్పుడు తన మార్కెట్, ఇమేజ్ రెండూ డౌన్ లో ఉన్నాయి. అజిత్ తో మూవీ చేయి దాకా వచ్చి జారిపోయింది. అసలు ప్రదీప్ ఒప్పుకోవడమే గొప్ప విషయమంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది. దీని వల్ల ఎల్ఐకెకు దక్కాల్సిన బజ్ లో కోత పడింది. పైగా హీరోయిన్ కృతి శెట్టి సైతం వరస డిజాస్టర్లతో మార్కెట్ ని రిస్క్ లో పడేసుకుంది.

అసలైన విషయం మరొకటి ఉంది. ఇలాంటి సినిమాలకు అనిరుధ్ రవిచందర్ సంగీతం మోత మోగించాలి. కానీ అలాంటిదేమి జరగలేదు. వైరల్ అయ్యే ఛార్ట్ బస్టర్ కుదరలేదు. ఎవరైనా చెబితే తప్ప ఈయనే మ్యూజిక్ డైరెక్టరని అనుకోవడం కష్టం. మరీ బ్యాడ్ కాదు కానీ తన స్థాయిలో సాంగ్స్ లేవని మ్యూజిక్ లవర్స్ కంప్లయింట్. పదే పదే ఒకే తరహా యూత్ క్యారెక్టర్లు చేస్తున్నాడనేది ప్రదీప్ రంగనాథన్ మీద మరో కామెంట్. దీన్నతను సీరియస్ గా తీసుకోవాలి.

ధనుష్ తరహాలో అన్ని జానర్లు టచ్ చేయాలి. సీరియస్ సబ్జెక్టుల వైపు మొగ్గు చూపాలి. ఎంతసేపూ ప్రేమలు, బ్రేకప్ లు అంటూ పదే పదే అవే చేస్తే రొటీన్ అయిపోయే ప్రమాదం ఉంది. ముందు ఈ సేఫ్ గేమ్ ఆడటం తగ్గించాలనేది విశ్లేషకుల అభిప్రాయం. రేపు ఓపెనింగ్స్ ఎంత వచ్చినా అది ప్రదీప్ క్రెడిట్ లోకే వెళ్తుంది. ఒకవేళ హిట్ టాక్ వస్తే మంచిదే. లేదంటే మాత్రం హెచ్చరికగా మారుతుంది. డెకాయిట్ తో పోటీ ఉన్న నేపథ్యంలో తెలుగులో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.