డెకాయిట్ సరిచేయాల్సిన లెక్కలు

రేపు విడుదల కాబోతున్న డెకాయిట్ మీద ట్రేడ్ వర్గాలే కాదు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుక్ మై షోలో ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉండగా క్రమంగా నెంబర్లు పెరుగుతూ పోవడం శుభసూచకంగా చెప్పుకోవాలి. అంచనాలు మరీ అరివీరభయంకరంగా ఉన్నాయని చెప్పలేం కానీ అడివి శేష్ బ్రాండ్ తో పాటు ట్రైలర్ లో చూపించిన లవ్, యాక్షన్ కంటెంట్ దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాలనే నమ్మకాన్ని ఆడియన్స్ లో కలిగించింది. అదే ప్లస్ గా మారింది.

డెకాయిట్ సరిచేయాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. మొదటిది అడివి శేష్ హిట్ 2 తర్వాత మూడేళ్ల పాటు దీన్ని నిర్మాణంలో ఉంచిన గ్యాప్ కి న్యాయం జరిగేలా కంటెంట్ ఉందని జనాలు భావించాలి. రెండోది నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఈసారి తండ్రి, మావయ్య ప్రమేయం లేకుండా స్వంతంగా అన్నపూర్ణ, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకుంది. ప్రొడ్యూసర్ గా ఈ అడుగు ఎలా ఉంటుందోనని ఇతర నిర్మాతలు వేచి చూస్తున్నారు.

మూడోది ఏ బ్రాండ్ ఇమేజ్ లేని దర్శకుడు షానియేల్ డియో పనితనం. డైరెక్షన్ అనుభవం ఎక్కువగా లేకపోయినా ఇంత పెద్ద యాక్షన్ గ్రాండియర్ ని అది కూడా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో తెరకెక్కించడం పెద్ద సవాల్. శేష్, నాగార్జున, సుప్రియ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నాలుగోది మృణాల్ ఠాకూర్ టేస్ట్. సీతారామం, హాయ్ నాన్న లాంటి క్లాసిక్స్ చేశాక ఫ్యామిలీ స్టార్ రూపంలో తనకో డిజాస్టర్ పడింది. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లోకి రావాలంటే డెకాయిట్ చేయి అందించాలి.

ఇలా ఇన్నేసి క్యాలికులేషన్లు డెకాయిట్ మీద ఉన్నాయి. గత వారం రిలీజైన బైకర్, రాకాస చెప్పుకోదగ్గ టాక్ తో మొదటి వీకెండ్ బండి లాగినప్పటికీ తర్వాత స్లో అయ్యాయి. రెండో వారాంతంలో ఏ మేరకు పికప్ అవుతాయనేది డెకాయిట్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ శేష్ మూవీ కనక హిట్ అనిపించుకుంటే ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ ఇదే అవుతుంది. టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నమ్మకాలు నిజమయ్యేలానే ఉన్నాయి. రేపు ఉదయం ఎనిమిది నుంచి షోలు స్టార్ట్ కాబోతున్నాయి.