తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. చిత్రీకరణ ఆల్మోస్ట్ అయిపోయిందని రజని బయటికి చెబుతున్నా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బయటికి రాలేనంత బిజీ పనుల్లో తలమునకలై ఉన్నాడు. చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2కి క్యామియోల సమస్య వచ్చి పడిందట. ఫస్ట్ పార్ట్ లో మేజిక్ చేసిన శివరాజ్ కుమార్. మోహన్ లాల్ ఇందులోనూ కొనసాగుతారు. వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు.
కాకపోతే ఈసారి వీళ్లకు తోడుగా షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతిని రంగంలోకి దించాలని దానికి అనుగుణంగా స్క్రిప్ట్ రాసుకున్నాడు నెల్సన్. అంతకు ముందే బాలకృష్ణ కోసం ఎంతో ట్రై చేశారు కానీ పనవ్వలేదు. గెస్టు పాత్రలకు బాలయ్య చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. అయినా సరే రజనితో స్నేహం వల్ల చేయొచ్చేమో అని అందరూ అనుకున్నారు. లెన్త్ తో పాటు రెమ్యునరేషన్ ఇష్యూ ఇది జరగకుండా ఆపి ఉండొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పుడు కొత్త షాక్ ఏంటంటే షారుఖ్ ఖాన్ జైలర్ 2 చేయలేనని చెప్పేశాడట. తన స్వంత మూవీ కింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన కింగ్ ఖాన్ దాన్ని డిసెంబర్ రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ షూట్ ఇంకా పెండింగ్ ఉండటంతో వేరే సినిమాలకు టైం కేటాయించే అవకాశం లేదని చెప్పినట్టు వినికిడి. విజయ్ సేతుపతి గురించి కూడా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి కానీ టీమ్ నిర్ధారణగా చెప్పే వరకు ఈ కన్ఫ్యూజన్ పోయేలా లేదు.
ఇదంతా కొనసాగుతోంది కాబట్టే విడుదల తేదీ విషయంలో జైలర్ 2 టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముందు అనుకున్న డేట్ అయితే ఆగస్ట్ రెండో వారం. జైలర్ ఇదే టైంలో వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది. అదే సెంటిమెంట్ కొనసాగించాలని నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్. కానీ పరిస్థితులు దానికి ఎంత మేర సహకరిస్తాయో అనుమానంగా ఉంది. ఒకవేళ మిస్ అయితే దీపావళి అప్పుడూ కుదరకపోతే రజని పుట్టినరోజు డిసెంబర్ 12 లాక్ చేస్తారు. చూడాలి మరి ఏం జరగనుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates