ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ప్రతి ఇంట్లోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు అల్లరి నరేష్. తన తొలి చిత్రం ‘అల్లరి’ సర్ప్రైజ్ హిట్ అయి, తన ఇంటి పేరుగా మారిపోయింది. తర్వాత ఎన్నో కామెడీ సినిమాలతో అతను అలరించాడు. ఒక దశాబ్దం పాటు నరేష్‌కు ఎదురే లేకపోయింది.
నరేష్ సినిమాలంటే కడుపుబ్బ నవ్వుకోవచ్చని అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు వెళ్లేవాళ్లు. తన ఫ్లాప్ సినిమాలు కూడా డబ్బులు తెచ్చిపెట్టేవి. నిర్మాతల పాలిట కల్ప తరువులా ఉండేవాడు నరేష్. తనతో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుండేది.
కానీ ఒక దశ దాటాక తన కామెడీ సినిమాలు జనాలకు మొహం మొత్తేయడం మొదలుపెట్టింది. దీంతో వరుస ఫ్లాపులు ఎదురై కామెడీనే వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నేళ్ల ముందు రూటు మార్చి ‘నాంది’ రూపంలో పూర్తి సీరియస్ మూవీ చేశాడు నరేష్. అది మంచి ఫలితాన్నందుకుంది కానీ.. తర్వాత చేసిన ఈ తరహా సినిమాలేవీ ఫలితాన్నివ్వలేదు. ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఆ ఒక్కటీ అడక్కు, 12 ఏ రైల్వే కాలనీ.. ఇలా ప్రతి సినిమా ఫ్లాపే అయింది.
దీంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడు అల్లరోడు. తన చివరి సినిమా ‘ఆల్కహాల్’ విడుదలకే నోచుకోకుండా పక్కన పడిపోయింది. దాని సంగతేమో తేల్చకుండా నరేష్ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రమే.. కనకదుర్గ. ఈసారి సక్సెస్ కోసం నరేష్ ఇంకో రూట్లోకి వెళ్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్లే ఇది భక్తి రస చిత్రమట.
నరేష్ నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేం.
కానీ ఇప్పుడు దేవుడు వెర్సస్ దుష్టశక్తి అంటే జనం ఊగిపోతున్నారని ఈ రూట్లోకి వెళ్తున్నట్లుంది. ఈ చిత్రానికి సీనియర్ రైటర్ బీవీఎస్ రవి కథ అందించడం విశేషం. చిత్ర నిర్మాతల్లో కూడా ఆయనొకరు. సత్యదేవ్‌తో ‘47 డేస్’ అనే సినిమా, నరేష్ అగస్త్యతో ‘వికటకవి’ అనే వెబ్ సిరీస్ తీసిన ప్రదీప్ మద్దాలి ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ చౌదరి అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది. మరి ఈ ప్రయత్నమైనా అల్లరి నరేష్‌కు విజయాన్నిస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates