ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే సినిమా వచ్చేది. దీంతో రిలీజ్ డేట్‌ను బట్టి చాలా ముందు నుంచే ప్రేక్షకులు కౌంట్ డౌన్‌లు కూడా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పదిలో ఏడెనిమిది సినిమాలు వాయిదా పడుతున్నాయి. డేట్లు మార్చుకుంటున్నాయి.
ఈ రిలీజ్ డేట్లు మార్చే ట్రెండు ఊపందుకోవడంలో రాజమౌళి పాత్ర కొట్టిపారేయలేనిది. ఆయన తీసిన ఏ భారీ చిత్రమూ చెప్పిన రిలీజ్ డేట్‌కు రాలేదు. జక్కన్న చివరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మొదలైనపుడు 2020లో రిలీజ్ పక్కా అని చెప్పి.. చివరికి 2022లో విడుదల చేశాడు. కాకపోతే జక్కన్న ఆలస్యంతో పాటు కొవిడ్ ప్రభావం కూడా ఆ సినిమా అంత లేటుగా రిలీజైంది.
కానీ ఇప్పుడు రాజమౌళి నుంచి రాబోతున్న ‘వారణాసి’ మాత్రం పక్కాగా చెప్పిన డేటుకే వస్తుందని అంటున్నారు. నిజంగా అది జరిగితే మాత్రం వచ్చే ఏడాది ఇదే రోజు బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం.
ఈ రోజు 2025 ఏప్రిల్ 7. వచ్చే ఏడాది ఇదే డేటుకి ‘వారణాసి’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు 1 ఇయర్ కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. ‘వారణాసి’పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమాలే తీశాడు జక్కన్న. ఇది పాన్ వరల్డ్ మూవీ.
హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సహా అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వారికి విపరీంగా నచ్చేసి.. జక్కన్న నెక్స్ట్ మూవీ మీద అంచనాలు పెట్టేసుకున్నారు. గత ఏడాది రిలీజైన ‘వారణాసి’ గ్లింప్స్ చూశాక ఇది ‘బాహుబలి’ తరహాలో పెను సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
కాబట్టి 2027 ఏప్రిల్ 7న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోవడం లాంఛనమే. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. ఓవరాల్ రికార్డులన్నీ బద్దలు కావడానికి రెండు వారాల సమయం చాలు. మరి జక్కన్న చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసి, ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఏప్రిల్ 7న చిరస్మరణీయమైన తేదీగా మారుస్తాడేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates