అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన ప్రక్రియ. ఇప్పుడు కామెడీ రాసేవాళ్లు.. తీసేవాళ్లు.. రాసేవాళ్లు తగ్గిపోయారు. ఒకప్పుడు తెలుగులో పాతికమంది దాకా పేరున్న కమెడియన్లు ఉండేవారు. కానీ ఇప్పుడు నిఖార్సయిన కమెడియన్ల సంఖ్య బాగా తగ్గిపోయింది.
ఇక గతంలో ఉన్న ‘కామెడీ హీరో’ అనే ట్యాగ్ దాదాపుగా కనుమరుగైపోతున్న పరిస్థితి. గతంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఏళ్ల పాటు కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. తర్వాత కొంచెం గ్యాప్ వస్తే.. అల్లరి నరేష్ అందుకున్నాడు. అతను చాలా ఏళ్లే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు.
కానీ అతను ఫామ్ కోల్పోయి, ఒక దశలో సీరియస్ సినిమాల వైపు అడుగు వేయడంతో కామెడీ హీరో అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేకపోయారు. నరేష్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నా.. ఒకప్పట్లా కామెడీ చేయట్లేదు. ట్రై చేసినా నవ్వులు పండట్లేదు.
ఐతే ఈ తరం అభిరుచికి తగ్గట్లుగా మరో ‘అల్లరోడు’ దొరికాడు. తన పేరు.. సంగీత్ శోభన్. దివంగత దర్శకుడు శోభన్ చిన్న కొడుకే ఈ కొత్త అల్లరోడు. ముందుగా శోభన్ పెద్ద కొడుకు సంతోష్ హీరో అయ్యాడు. అతడి ప్రయాణం ఒడుదొడుకులతో సాగింది. కష్టపడి కాస్త నిలదొక్కుకున్నాడు.
సంతోష్ నటుడిగా పరిచయం అయిన ‘గోల్కొండ హైస్కూల్’లోనే బాల నటుడిగా చిన్న పాత్ర చేశాడు సంగీత్. ఆ తర్వాత తన అన్న చేసిన వెబ్ సిరీస్ ‘బేకర్ అండ్ బ్యూటీ’లో ఒక కామెడీ రోల్ చేసి మెప్పించాడు. ఆపై ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేశాడు. అదీ వర్కవుట్ అయింది.
ఒక ముగ్గురు హీరోల్లో ఒకడిగా సంగీత్ చేసిన ‘మ్యాడ్’ తన కెరీర్లో మలుపు. ఇందులో మిగతా ఇద్దరినీ డామినేట్ చేస్తూ తనదైన శైలిలో ఫుల్ కామెడీ పంచాడు. తన కామెడీ టైమింగ్ అందరికీ నచ్చింది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ‘మ్యాడ్-2’ కూడా హిట్టయి అతడికి ఇంకా మంచి గుర్తింపునిచ్చింది. ఇప్పుడు ‘రాకాస’ చిత్రంతో మరో మెట్టు ఎక్కాడు సంగీత్.
కంటెంట్ పరంగా కొంచం వీక్ అయినప్పటికీ.. ‘రాకాస’లో నవ్వులు బాగా పండాయి, యూత్ బాగా చూస్తున్నారు అంటే సంగీతే కారణం. అతడి అల్లరే జనాలను ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పటి కుర్రకారుకు నచ్చేలా టిపికల్ కామెడీ స్టైల్ ఉండడం సంగీత్‌కు పెద్ద ప్లస్. సంగీత్ చేసే కామెడీ కోసమే జనం థియేటర్లకు వస్తున్నారు. అతను కూడా తన బలాన్ని గుర్తించి.. కేవలం ఎంటర్టైన్మెంట్ సినిమాలే చేస్తానని ఇటీవల స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. మరి ఇక ముందు కూడా ఇలాగే నవ్విస్తూ ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’గా స్థిరపడతాడేమో చూాడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates