పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా నిర్మాణ సంస్థలు మాత్రం పెదవి విప్పడం లేదు. దీనికి తోడు రామ్ చరణ్ మొన్న రాకాస ఇంటర్వ్యూలో లేట్ లేదని చెప్పడం, ట్విట్టర్ వేదికగా డిస్ట్రిబ్యూటర్ల లిస్టు ఒక్కొక్కటిగా బయటికి రావడం అనుమానాలు పెంచుతున్నాయి తప్పించి తగ్గించడం లేదు. దీని వల్ల బయ్యర్లు ఏమో కానీ అభిమానులు ఒత్తిడికి గురవుతున్నారు.

తాజా సమాచారం మేరకు పెద్ది ఏప్రిల్ 30 రావడం లేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా తగినంత సమయం దొరికేలా జూన్ 4 లేదా జూన్ 25 రెండు ఆప్షన్ల మీద కసరత్తు చేస్తున్నారట. మొదటి డేట్ కి టాక్సిక్ ఉంది కాబట్టి జూన్ మూడో వారానికి షిఫ్టయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ యష్ రానంటే మాత్రం రామ్ చరణ్ రంగంలోకి దిగవచ్చు. పెద్ది ప్రకటన రాగానే మా ఇంటి బంగారం, స్వయంభు లాంటివి డేట్లు వేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. గాయపడ్డ సింహం ఆల్రెడీ మే 1 వస్తుంది.

సో ఇంత క్లారిటీ బయటి వర్గాలకు ఉన్నప్పుడు ప్రొడక్షన్ హౌస్ వీలైనంత త్వరగా స్పందిస్తే మంచిది. ప్రస్తుతం ఐటెం సాంగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న దర్శకుడు బుచ్చిబాబు అందులో ఎవరు డాన్స్ చేస్తారనేది బయట పెట్టడం లేదు. మృణాల్ ఠాకూర్ ని అడిగితే దాటవేసింది తప్ప చేయడం లేదని చెప్పలేదు. డెకాయిట్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ లోనే ఉండటం చూస్తుంటే సాధ్యాసాధ్యాలను అంత ఈజీగా కొట్టిపారేయలేం.

టెన్షన్ తీరిపోయేలా ముందైతే ఈ అనుమానాల గోడలు బద్దలు కొట్టేయాలి. జూన్ ఫిక్స్ కావడం ఒకరకంగా మంచిదే. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఐపీఎల్ ఫీవర్ జనంలో బాగానే ఉంది. కీలక మ్యాచులు ఉన్నప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. బైకర్ లాంటివి ప్రభావితం చెందుతున్న వైనం గమనిస్తున్నాం. సో పెద్ది తప్పుకోవడం అన్ని రకాలుగా మేలు చేసేదే. రెహమాన్ ఇచ్చిన పాటల్లో రెండు ఛార్ట్ బస్టర్ అయిపోగా మిగిలిన వాటి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.