అవును… కళ్యాణ్ రామ్ సరసన ఆమెనే

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా అపజయం అన్నదే లేకుండా సాగిపోతున్నాడు. ఒక్క ‘ఎఫ్-3’ మాత్రమే ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది కానీ.. ఇప్పటిదాకా అనిల్ తీసిన మిగతా సినిమాలన్నీ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లే. ఆయన సినిమాలో నటిస్తే ఒక సక్సెస్ జమ అయినట్లే.

అందులోనూ చాలా ఏళ్లుగా హిట్ అన్నదే లేక ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులకు అనిల్ ఛాన్స్ ఇస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు కన్నడ భామ కృతి శెట్టి ఇదే ఆనందంలో ఉంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో అనిల్ తీయబోతున్న కొత్త సినిమాలో కృతిని ఒక కథానాయికగా ఎంచుకున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా విషయం అధికారికం అయింది.

కృతి కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన అనిల్.. తన తర్వాతి చిత్రంలో కృతి నటించనున్న విషయాన్ని ధ్రువీకరించాడు. ప్రచారంలో ఉన్నట్లే కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి కనిపించనున్నట్ల కూడా అనిల్ వెల్లడించాడు. దీంతో ఇక ఈ చిత్రంలో వెంకీ సరసన ఎవరన్నదే తేలాల్సి ఉంది. ఈ పాత్రకు కీర్తి సురేష్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయి.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన కృతికి.. ఆపై వరుసగా ఫ్లాపులే ఎదురయ్యాయి. ఆమె ఫ్లాపుల పరంపర ఇప్పటికే అరడజనుకు చేరుకుంది.

‘ఎల్ఐకే’ అయినా హిట్ అందిస్తుందేమో అని ఆమె ఎదురు చూస్తోంది. వరుసగా రెండు సంక్రాంతి పండుగలకు ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో భారీ విజయాలందుకున్న అనిల్.. ఇప్పుడు తీయబోయే సినిమాతో మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేయబోతున్నాడు.