శేష్‌ను చూసి అసూయ చెందిన హీరో ఎవరు?

టాలీవుడ్లో అడివి శేష్‌ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను.. తర్వాత విలన్ పాత్రలు చేసి మెప్పించాడు. ముఖ్యంగా ‘పంజా’ సినిమాలో అతను చేసిన నెగెటివ్ రోల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆపై ‘క్షణం’ సినిమాతో ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు శేష్. ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయడమే కాక.. రచనలోనూ భాగమైన శేష్.. మేకింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నాడు.

ఆ సినిమా సర్ప్రైజ్ బ్లాక్‌బస్టర్ అయి.. శేష్‌కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా ఇదే మోడల్ ఫాలో అవుతూ.. గూఢచారి, ఎవరు, మేజర్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు శేష్. ‘హిట్-2’ సైతం అతడికి పెద్ద విజయాన్ని అందించింది. ఇప్పుడు శేష్ నుంచి రాబోతున్న డెకాయిట్, గూఢచారి-2 చిత్రాల మీద భారీ అంచనాలే ఉన్నాయి. ‘క్షణం’ సినిమాను కోటి రూపాయల బడ్జెట్లో చేసిన తాను.. ఇప్పుడు వంద కోట్ల బడ్జెట్లో ‘గూఢచారి-2’ చేసే లెవెల్‌కు ఎదిగానంటూ ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు శేష్.

ఐతే తన రేంజ్ పెరగడం గురించి ఇటీవల ఒక స్టార్ హీరో ఒకింత అసూయతో తన వద్ద ఓ కామెంట్ చేశాడంటూ శేష్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన నిర్మాత బర్త్‌డే పార్టీలో కలిసిన ఆ హీరో తనకు చెయ్యి ఇస్తూ ‘‘నువ్వు నా రేంజ్ బడ్జెట్లలో సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయావు’’ అని కామెంట్ చేశాడని శేష్ అన్నాడు.

ఈ కామెంట్‌ను ఇంగ్లిష్‌లో చెప్పిన శేష్.. తెలుగులో సదరు హీరో స్టయిల్లో చెబితే అతనెవరో కనిపెట్టేస్తారని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ వినగానే.. ఇంత కుళ్లేంటి అనుకున్నానని శేష్ తెలిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో శేష్‌తో ఈ కామెంట్ చేసిన హీరో ఎవరా అని నెటిజన్లు ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు.

ఇండస్ట్రీలో నువ్వెంత నేనెంత అని పోల్చుకునే గేమ్ అయిపోయిందని.. కానీ తాను ఉన్న యంగ్ హీరోలందరిలోకి తోపు అయిపోవాలనుకుంటే.. ఆరుగురు టాప్ హీరోలున్నారని.. వాళ్లను దాటితే రజినీకాంత్, చిరంజీవి ఉన్నారని.. వాళ్లను మించి కింగ్ ఖాన్ ఉన్నాడని.. ఆయన కంటే పైన టామ్ క్రూజ్ ఉన్నాడని.. కాబట్టి దీనికి అంతెక్కడ అని శేష్ వ్యాఖ్యానించాడు.