ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్ కూడా తీస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీయించుకున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఓవైపు వైసీపీకి కలిసొచ్చేలా యాత్ర, యాత్ర-2 లాంటి తీయించుకున్న ఆ పార్టీ.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మతో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, వ్యూహం లాంటి చిత్రాలు చేయించింది.
ఐతే 2024 ఎన్నికల ముంగిట ఇలాంటి ప్రయత్నాలేవీ పని చేయలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ మీద వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి. ఐతే ఇప్పుడు తమిళనాట ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది. కొత్తగా టీవీకే పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచిన విజయ్‌ని టార్గెట్ చేస్తూ అక్కడ ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు.. టీఎన్2026.
నటుడిగా చాలా మంచి పేరున్న తంబిరామయ్య ఈ చిత్రానికి స్క్రిప్టు అందిస్తే.. ఆయన తనయుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. ఉమాపతి.. అర్జున్ తనయురాలు ఐశ్వర్య భర్త కావడం విశేషం. తంబిరామయ్యకు ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది కానీ.. ఆయన డీఎంకే పార్టీకి మద్దతుదారు. ఆ పార్టీ ఫండింగ్‌తోనే విజయ్‌ని టార్గెట్ చేస్తూ టీఎన్ 2026 సినిమా తీశాడని భావిస్తున్నారు.
ఇందులో సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ యాక్టర్ నటరాజన్ అలియాస్ నాటీ హీరోగా నటించాడు. సినిమాలో అతడి లుక్ చూస్తే విజయే గుర్తుకు వస్తున్నాడు. సినీ రంగంలో వెలిగిపోతూ, రాజకీయాల్లోకి వచ్చిన ఒక స్టార్ కథ ఇదంటూ తమ సినిమా విజయ్ మీద తీసిందే అని చెప్పకనే చెప్పేశాడు తంబిరామయ్య.
అదే సమయంలో విజయ్‌ని టార్గెట్ చేసే సన్నివేశాలేమీ లేవని.. తాను విజయ్‌తో కలిసి నటించానని.. విజయ్ సలహాదారు అయిన ఆధవ్ అర్జున్ తనకు ఫోన్ చేసి కంగారు పడ్డాడని.. రిలీజ్ తర్వాత తాము ఫీలవడానికి ఇందులో ఏమీ లేదని అర్థం చేసుకుంటారని తంబిరామయ్య వ్యాఖ్యానించాడు. కానీ ఈ చిత్రం డీఎంకే ప్రాయోజితమేనని.. అనవసరంగా విజయ్‌ని టార్గెట్ చేయాలని చూస్తే డీఎకేంకు అసలుకే మోసం రావచ్చని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
