టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్: ఇన్ఫ్లుయెన్సర్ వీడియో వైరల్

​అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ​ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లు సినిమాల్లోకి రావడం సాధారణం అయిపోయింది. ఇదే క్రమంలో ఆమె కూడా తన పోర్ట్‌ఫోలియోను కొందరు టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్లకు పంపినట్లు వీడియోలో వెల్లడించింది. అయితే అక్కడ పని చేసే వ్యక్తులు ఆమె టాలెంట్ కంటే ఇతర విషయాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ఆరోపించింది. 

పని పట్ల ఎంత ‘కమిట్‌మెంట్’ ఇస్తారని వారు అడిగిన తీరు, ఆ తర్వాత జరిగిన సంభాషణలు తనను ఎంతగానో కలచివేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రవర్తన వల్లే చాలామంది టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారని ఆమె పేర్కొంది. ఈ వీడియో వైరల్ కావడంతో టాలీవుడ్ లోని ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ మద్దతు గ్రూప్, లైంగిక వేధింపుల నిరోధక ప్యానెల్ సభ్యురాలు, నటి ఝాన్సీ స్పందించారు. ఆమె నేరుగా ఆ అమ్మాయికి మెసేజ్ చేసి, బాధ్యులపై ఫార్మల్ గా ఫిర్యాదు చేయాలని కోరారు. 

దీనికి సంబంధించి ఝాన్సీ పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్లను కూడా సదరు ఇన్ఫ్లుయెన్సర్ తన స్టోరీలో పంచుకుంది. కేవలం మాటలతో సరిపెట్టకుండా, ఈ విషయాన్ని చట్టపరంగా ముందుకు తీసుకెళ్లడానికి ఝాన్సీ ఇచ్చిన మద్దతు ఇప్పుడు చర్చనీయాంశమైంది.  అయితే తన వద్ద టెక్స్ట్ మెసేజ్‌లు తప్ప బలమైన రికార్డెడ్ ఆధారాలు లేవని, కానీ తనకు తెలిసిన పేర్లను విమెన్ సపోర్ట్ టీమ్‌కు అందజేశానని ఆమె స్పష్టం చేశారు. తదుపరి చర్యలు ఎలా ఉంటాయో తెలియకపోయినా, ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే తాను బయటకు వచ్చి మాట్లాడుతున్నట్లు తెలిపింది. గతంలో కూడా కొందరు నటీమణులు ఇలాంటి ఆరోపణలు చేసినా, అవి కొద్దిరోజులకే సద్దుమణిగిపోయాయి.

​కానీ ఈసారి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటం, పైగా ఝాన్సీ వంటి సీనియర్ నటులు రంగంలోకి దిగడంతో ఇదొక సీరియస్ ఇష్యూగా మారింది. ఇండస్ట్రీలో సేఫ్ స్పేస్ లేకపోవడం వల్లే స్థానిక నటీమణులకు అవకాశాలు దక్కడం లేదనేది తరచుగా వస్తున్న ఆరోపణలు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ప్రొఫెషనల్ గా ఎదగాలనుకునే అమ్మాయిలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వడం వ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపుతోందని అంటున్నారు. వ్యవస్థలో మార్పు రావాలంటే కేవలం ఫిర్యాదులు మాత్రమే సరిపోవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.