జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ ఉంటాడు. కానీ పెద్దగా ఆడిన దాఖలాలు తక్కువ. ఒకటి ఆరా తప్ప సక్సెస్ లు లేవు. అయినా సరే నిర్మాతలు వరసగా ప్రాజెక్టులు చేయడం విచిత్రం. ఇటీవలే హ్యాపీ రాజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాస్త పేరున్న మొహం కాబట్టి మొహమాటంతోనో థియేటర్ల ఫీడింగ్ కోసమో మంచి డిస్ట్రిబ్యూటర్లే దొరికారు. పోటీలోనూ స్క్రీన్లు దొరికాయి.
కట్ చేస్తే హ్యాపీ రాజ్ నిరాశపరిచింది. అసలు మొన్న శుక్రవారం రిలీజైన సంగతే చాలా మంది సాధారణ ప్రేక్షకులకు తెలియదంటే అబద్దం కాదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో పనవ్వలేదు. యూత్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించి టైం పాస్ చేయించాలని చూసిన కొత్త దర్శకుడు మరియా రాజా ఎలంచెజియన్ వాటిని బ్యాలన్స్ చేయడంల చేతులు ఎత్తేశాడు. దీంతో బాగుంటే తప్ప డబ్బింగులను ఆదరించని తెలుగు జనాలు హ్యాపీ రాజ్ కి నో చెప్పేశారు.
కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా కిట్టుబాటు కాని ఇలాంటి అనువాదాలతో ఎవరికీ ప్రయోజనం కలగడం లేదు. అంతో ఇంతో కొంచెం డీసెంట్ టాక్ వచ్చిన యూత్ కూడా మన దగ్గర అద్భుతాలు చేయలేకపోయింది. తమిళ వెర్షన్ రెండు వారాలకే యాభై కోట్లు దాటితే మన దగ్గర ఫస్ట్ వీకెండ్ కే నెమ్మదించేసింది. మైత్రి డిస్ట్రిబ్యూషన్, శర్వానంద్ సపోర్ట్ ఇవేవి పని చేయలేదు. యూత్ కే ఇలా ఉంటే ఇక హ్యాపీ రాజ్ పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.
ప్రాక్టికల్ గా చూసుకుంటే మండిపోయే ఎండలు, ఐపీఎల్ సీజన్, పిల్లల పరీక్షలు ఇలా రకరకాల కారణాల వల్ల బాక్సాఫీస్ డ్రైగా ఉంది . అదిరిపోయే కంటెంట్ ఉందంటే తప్ప జనం థియేటర్లకు రావడం లేదు. దురంధర్ ది రివెంజ్ ఒక్కటే ఈ విషయంలో నెగ్గింది. పవన్ కళ్యాణ్ సైతం ఎదురీదలేక ఉస్తాద్ భగత్ సింగ్ తో ఫెయిల్యూర్ చవి చూడాల్సి వచ్చింది. అందుకే హ్యాపీ రాజ్ లాంటివి ఊసులో లేకుండా పోయాయి. చెన్నై లవ్ స్టోరీ ఫేమ్ శ్రీ గౌరీప్రియా ఇందులో హీరోయిన్.
Gulte Telugu Telugu Political and Movie News Updates
