ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు.. ప్ర‌మోష‌న్ ప‌రంగా అది ఆ చిత్రానికి ఎంతో ప్ల‌స్ అవుతుంది. ఇలాంటి సాయాలు చేయ‌డానికి ప్ర‌భాస్ ఎప్పుడూ ముందుంటాడు. సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డు కానీ.. ఆ అకౌంట్ల‌ను ప్ర‌భాస్ వాడేదే ఇలా వేరే సినిమాల టీజ‌ర్లు, ట్రైల‌ర్ల గురించి త‌న అభిప్రాయం చెప్పి ప్రమోష‌న్ ప‌రంగా సాయం చేయ‌డానికే.

అందులోనూ త‌న‌కు కావాల్సిన వాళ్లు అంటే చాలు.. జ‌స్ట్ పోస్టులు పెట్ట‌డంతో స‌రిపెట్ట‌కుండా.. అవ‌స‌ర‌మైతే ఇంట‌ర్వ్యూల్లో పాల్గొన‌డానికి, వీడియో బైట్లు ఇవ్వ‌డానికి కూడా రెడీగా ఉంటాడు రెబ‌ల్ స్టార్. దివంగ‌త ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌కు వ‌ర్షం లాంటి పెద్ద హిట్ ఇచ్చాడ‌ని ఆయ‌న కొడుకు సంతోష్‌కు ఎన్నిసార్లు ప్ర‌భాస్ స‌పోర్ట్ చేశాడో తెలిసిందే. క‌పుల్ ఫ్రెండ్లీ సినిమా కోసం ఒక ఇంట‌ర్వ్యూ సైతం చేశాడు. పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ కోసం కూడా ఇలాగే స‌పోర్ట్ చేశాడు.

ఇక త‌న మిత్రులైన యువి క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ, ప్ర‌మోద్‌ల సినిమాలంటే ప్ర‌భాస్ ఎలాంటి సాయం చేయ‌డానికైనా సిద్ధం. ఈ బేన‌ర్లో తెర‌కెక్కిన కొత్త చిత్రం బైక‌ర్ కోసం ప్ర‌భాస్ ఒక వీడియో ప్రోమోనే చేసి పెట్టాడు. ఈ సినిమా బైక్ రేసుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన నేప‌థ్యంలో త‌న‌కు చాలా స్పెష‌ల్ అయిన బైక్ మీద రైడ్‌కు బ‌య‌ల్లేరుతూ బైక‌ర్‌కు ప‌బ్లిసిటీ చేసి పెట్టాడు ప్ర‌భాస్.

శ‌ర్వా అంటే తన ఫ్యామిలీ హీరో అని.. వంశీ, ప్ర‌మోద్ త‌న స్నేహితులు, ఫ్యామిలీ అని చెప్పిన‌ ప్ర‌భాస్.. ట్రైల‌ర్ చూసి కొన్ని కొన్ని న‌మ్మేయాలి డూడ్ అంటూ యువి బేన‌ర్లో తాను చేసిన స్పెష‌ల్ మూవీ మిర్చి డైలాగ్‌ను గుర్తు చేస్తూ బైక‌ర్‌కు ఎలివేష‌న్ ఇచ్చాడు.

లెట్స్ స్టార్ట్ ద రేస్ అని ప్ర‌భాస్ అన‌డంతో ఈ ప్రోమో ముగిసింది.. బైక‌ర్ గురించి ఇంత‌కుముందే సోష‌ల్ మీడియా పోస్టు పెట్టిన ప్ర‌భాస్.. ఇప్పుడు ఇంత పెద్ద సాయం చేయ‌డం సినిమాకు ప‌బ్లిసిటీ ప‌రంగా పెద్ద బూస్ట్ అన‌డంలో సందేహం లేదు. ప్ర‌భాస్ పెద్ద మ‌న‌సును మ‌రోసారి నెటిజ‌న్లు కొనియాడుతున్నారు ఈ వీడియో చూసి. అభిలాష్ రెడ్డి దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బైక‌ర్ ఈ శుక్ర‌వార‌మే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.