జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా లేదు. ఆల్రెడీ ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్లలో దురంధర్ సినిమాను దాటేసింది. రెండో వీకెండ్ తర్వాత కొంచెం స్లో అయినప్పటికీ.. దురంధర్-2కు లాంగ్ రన్ ఉంటుందనే ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం రూ.2 వేల కోట్ల వసూళ్ల క్లబ్బులో చేరే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడంలో కథా కథనాలతో పాటు అదిరిపోయే క్యారెక్టర్లు.. పెర్ఫార్మెన్సులు కారణం అనడంలో సందేహం లేదు. హీరో, విలన్.. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి పాత్రనూ అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు ఆదిత్య ధర్. దురంధర్ -1లో రణ్వీర్ చేసిన హంజా పాత్రకు దీటుగా అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ దెకాయత్ క్యారెక్టర్ నిలిస్తే.. పార్ట్ -2లో హీరోకు ఇలాగే దీటుగా నిలిచి బాగా హైలైట్ అయిన పాత్ర రాకేష్ బేడీ చేసిన జమీల్ జమాలి. ఆ పాత్రకు చివర్లో ఇచ్చిన ట్విస్ట్ భలేగా పేలింది.

దురంధ‌ర్‌లో పాత్ర‌ల‌న్నీ నిజ జీవిత వ్య‌క్తుల ఆధారంగా రూపొందిన‌వే అన్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌కు క‌ల్పిత విష‌యాలు జోడించి ఈ పాత్ర‌ల‌ను తీర్చిదిద్దాడు ఆదిత్య‌. జ‌మీల్ పాత్ర‌ను న‌బీల్ గ‌బోల్ అనే పాకిస్థాన్ రాజ‌కీయ నాయ‌కుడిని పోలి ఉంటుంది. దురంధ‌ర్ రిలీజైన‌పుడు న‌బీల్ సైతం జ‌మీల్ పాత్ర‌ను ఓన్ చేసుకున్నారు. దాని గురించి గ‌ర్వంగా చెప్పుకున్నారు. కానీ దురంధ‌ర్-2 రిలీజ‌య్యాక న‌బీల్ స్వ‌రం మారిపోయింది.

ఈ సినిమాలో జ‌మీల్ పాత్ర‌ను.. ఇండియ‌న్ ఏజెంట్‌లా చూపించారు. పాకిస్థాన్‌లో ద‌శాబ్దాలుగా ఆశ్ర‌యం పొందుతున్న‌ మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీంకు విష‌పూరిత‌మైన ఇంజ‌క్ష‌న్ ఇచ్చి, అత‌ను తీవ్ర అనారోగ్యం పాలై మంచం ప‌ట్టేలా చేసింది జ‌మీలే అన్న‌ట్లుగా చూపించారు సినిమాలో. దీంతో న‌బీల్ ఇంత చేశాడా అని ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

ఈ డిస్క‌ష‌న్ న‌బీల్ గుండె గుబేల్‌మ‌నేలా చేసి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో దీని గురించి అడిగితే న‌బీల్ ఇబ్బంది ప‌డ్డాడు. తాను జీవిత కాలంలో ఎప్పుడూ దావూద్ ఇబ్ర‌హీంను క‌ల‌వ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న ఇంటికి 200 మీట‌ర్ల దూరంలో దావూద్ ఇల్లు ఉంద‌ని చెబుతార‌ని.. అది మీడియా ద్వారా విన‌డ‌మే త‌ప్ప‌.. తాను నేరుగా దావూద్‌ను క‌ల‌వ‌డం జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు న‌బీల్. దురంధ‌ర్-2లో జ‌మీల్ పాత్ర‌ను ప్రెజెంట్ చేసిన తీరుతో న‌బీల్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడ‌ని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది.