మణిశర్మ అభిమానులు కోరుకునేది ఇదే

నిన్న చెన్నై లవ్ స్టోరీ నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ రిలీజయ్యింది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కోసం నిర్మాతల్లో ఒకరు, కథకుడు సాయిరాజేష్ ఇంటికి వచ్చి ఈగలు తోలుకుంటున్న తన హార్మోనియం పెట్టెని బయటికి తీయించి దుమ్ము దులిపాడని, మంచి పాటలు చేయించుకున్నాడని స్టేజి మీద కితాబు ఇచ్చేశారు. ఏమాటకా మాటే. పాట నిజంగానే బాగుంది.

కాకపోతే మ్యూజిక్ లవర్స్ ఒకటి కోరుకుంటున్నారు. ఎవరో వచ్చి బూజు దులిపించే స్టేజిలో మణిశర్మ ఎప్పుడూ ఉండరు. ఈ మధ్య కాలంలో సక్సెస్ లేక వెనుబడిపోయారు తప్పించి హిట్లు పడితే వెంటపడే దర్శకులు ఎందరో ఉంటారు. శాకుంతలం, భళా తందనాన, డబుల్ ఇస్మార్ట్, ఆచార్య, రిపబ్లిక్, నేను మీకు బాగా కావాల్సినవాడిని మొదలైన సినిమాలన్నీ మణిశర్మ చేసినవే. ఒకటో రెండో తప్ప వీటిలో గుర్తుంచుకుని పదే పదే పాడుకునే పాటలు ఉండవు.

అందుకే మెలోడీ బ్రహ్మ రేసులో వెనుకబడి పోయారు. ఇస్మార్ట్ శంకర్ తో కంబ్యాక్ అయ్యాక మళ్ళీ  వెనుదిరిగి చూడరు అనుకుంటే వరస ఫ్లాపులు వెనక్కు నెట్టేసిన మాట వాస్తవం. ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు, సాంగ్స్ తో ఆడియన్స్ పదే పదే థియేటర్లకు వచ్చేలా చేసిన మణిశర్మ ఒక్కడు, ఇంద్ర, చూడాలని ఉంది. సమరసింహారెడ్డి, మురారి, చిరునవ్వుతో లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ కు ప్రాణం పోయడం ఎవరూ మర్చిపోలేరు. అందుకే ఆయనకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది.

ఇప్పుడీ చెన్నై లవర్ స్టోరీ మణిశర్మ ముందుకు వరసకు తెస్తే అంతకన్నా సంతోషించాల్సిన విషయం మరొకటి ఉండదు. అసలే టాలీవుడ్ లో మెలోడీ కంపోజర్స్ తగ్గిపోయారు. ట్రెండ్ పేరుతో హోరెత్తే సౌండ్లు, ఎలివేషన్ బిజిఎంతో చెవులకు పెద్ద పని చెబుతున్నారు. అందుకే చెన్నై లవ్ స్టోరీలో గురుతుందా గురుతుందా సాంగ్ హాయి ఫీలింగ్ కలిగిస్తోంది. ఆల్బమ్ లోని మిగిలిన పాటలు కూడా ఇదే రేంజ్ లో ఉంటాయని టీమ్ ఊరిస్తోంది. అదే నిజమైతే అంతకన్నా కావాల్సింది ఏముంది.