శాశ్వత్ సచ్ దేవ్… మనకు సూటవుతాడా

దురంధర్ ది రివెంజ్ విడుదలయ్యాక ఈ సినిమాలోని పాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మొదటి భాగంలోనూ ఛార్ట్ బస్టర్స్ ఉన్నప్పటికీ సీక్వెల్ మ్యూజిక్ కు వస్తున్న రెస్పాన్స్ వేరే లెవెల్ లో ఉంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్ దేవ్ పేరు జనం నోళ్ళలో బాగా నానుతోంది. ఫోక్, వెస్ టర్న్, క్లాసిక్ అన్ని మిక్స్ చేసి వెరైటీ కంపోజింగ్ తో ఆకట్టుకుంటున్న తీరు సంగీత ప్రియులను విశేషంగా మెప్పిస్తోంది. రీమిక్సులతోనూ ఇతను అదరగొడుతున్నాడు.

ఇప్పుడు చాలా మంది కళ్ళు శాశ్వత్ సచ్ దేవ్ మీద ఉన్నాయి. తమ ప్రాజెక్టుల్లో భాగం చేసుకునేందుకు కొందరు స్టార్ డైరెక్టర్లు ఆల్రెడీ ట్రై చేస్తున్నట్టు సమాచారం. రామ్ చరణ్ – సుకుమార్ కాంబో మూవీకి తనే ఉండొచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. కారణం లేకపోలేదు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న ది ఇండియా హౌస్ కి చరణ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. దానికి మ్యూజిక్ ఇస్తున్నది శాశ్వత్ సచ్ దేవే. సో అలా కనెక్షన్ కుదురుతుందని కొందరి అభిప్రాయం.

ఇదలా ఉంచితే శాశ్వత్ సచ్ దేవ్ వర్క్ స్టయిల్ చాలా విభిన్నంగా ఉంటుంది. హిందీ వరకు ఓకే కానీ అతని సెన్సిబిలిటీస్ మన కథలకు సూట్ అవుతాయా అనే అనుమానం సబబే. రాజస్థాన్ నుంచి వచ్చిన ఈ టెర్రిఫిక్ టాలెంట్ 2017లో తన సంగీత ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో పని చేసింది ఏడు సినిమాలకే. మరో అయిదారు చిత్రాలకు వేరే కంపోజర్స్ తో కలిసి ట్యూన్స్ ఇచ్చాడు. అంత సెలెక్టివ్ గా ఉంటాడన్న మాట.

అలాంటప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలకు వెంటనే ఒప్పేసుకుంటాడని చెప్పలేం. ది ఇండియా హౌస్ కూడా రెగ్యులర్ మూవీ కాకపోవడం, దేశభక్తితో ముడిపడిన అంశాలు ఉండటం వల్లే పని చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. సో రెగ్యులర్ కమర్షియల్ జానర్ కి ఎంతమేరకు బెస్ట్ ఇస్తాడనేది ఇప్పుడే చెప్పలేం. పంజాబీ ఫ్లేవర్ ఎక్కువగా ఉండే సచ్ దేవ్ పాటలకు కోట్లాది సంఖ్యలో వీర ఫాలోయింగ్ ఉంది. మరి అతన్ని ఏ తెలుగు దర్శకుడు ఒప్పిస్తాడో వేచి చూడాలి.