ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు బాక్సాఫీస్ స్టామినా గురించి సందేహాలు వ్యక్తం చేసిన వారికి.. ఆయన పనైపోయిందని కామెంట్లు చేసిన వారికి ఈ సినిమా తిరుగులేని సమాధానంగా నిలిచింది. ఐతే ఈ ఫామ్‌ను చిరు మున్ముందూ కొనసాగిస్తాడా అన్నది ఆసక్తికరం.
లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘విశ్వంభర’ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. దాని ట్రైలర్ లాంచ్ అయితే కానీ ఏమీ చెప్పలేం. ఇక బాబీ దర్శకత్వంలో చిరు నటించబోయే సినిమా.. ప్రొడక్షన్ హౌస్ వైపు కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యం అవుతోంది. బాబీ చివరి సినిమా ‘డాకు మహారాజ్’ ఓ మాదిరిగా ఆడింది. అంతకుముందు బాబీ.. మెగాస్టార్‌తో ‘వాల్తేరు వీరయ్య’ తీశాడు. అది పెద్ద హిట్టయింది. ఈసారి బాబీ ఎలాంటి మూవీ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఐతే ఈ సినిమాకు తాను రచయితగా పని చేస్తున్నట్లు ఇటీవలే కోన వెంకట్ ఇచ్చిన స్టేట్మెంట్ అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. కోన ఒకప్పుడు రచయితగా వైభవం చూశాడు. ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో నంబర్ వన్ రైటర్‌గా పేరు సంపాదించాడు. కానీ గత దశాబ్ద కాలంలో ఆయన పనితీరు ఏమీ బాగా లేదు. ‘బ్రూస్’ సహా ఎన్నో డిజాస్టర్లు ఇచ్చాడు. చివరగా ఆయన రచయితగా పని చేసిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ తుస్సుమనిపించింది.
తన ప్రొడక్షన్లో వచ్చిన ‘బ్యాండ్ మేళం’ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఈ మూవీ నచ్చకపోతే తాను రచయితగా పని చేస్తున్న తర్వాతి సినిమా (చిరుదే) చూడొద్దంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన కోన.. ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కోన జడ్జిమెంట్ ఎంతగా పడిపోయిందో ఈ సినిమా చూసిన వారికి అర్థమవుతోంది.
కోన పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాడని స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో చిరు సినిమాకు రైటర్‌గా పని చేస్తుండడం మెగా అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. తనకు మొదట్నుంచి అండగా ఉన్న కోన మీద బాబీకి అభిమానం ఉండొచ్చు కానీ.. ఆయన పెన్నులో ఇంకు అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు రాజీ పడాల్సిన అవసరం లేదని.. చిరు సినిమా నుంచి కోనను పక్కన పెట్టాలని అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో కోన చేసిన ద్రోహం వల్ల కూడా ఆయన మీద మెగా అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో చిరు సినిమాకు ఆయన పని చేయడం పట్ల మరింత నెగెటివ్‌గా ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates