కొత్త సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే రిలీజయ్యాయి కానీ ఆ స్థాయిలో థియేటర్లలో జనాలు లేక బయ్యర్ల టెన్షన్ కొనసాగుతోంది. ‘బ్యాండ్ మేళం’కు పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు. నిర్మాత కోన వెంకట్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి హైదరాబాద్ థియేటర్లను చుట్టేసి ఫ్రెష్ గా సీడెడ్ టూరు మొదలుపెట్టారు. వాళ్ళు వెళ్లిన షోలలో జనాలు కనిపిస్తున్నారు కానీ వాటికి ముందు వెనుక బుకింగ్స్ అదే స్థాయిలో ఉన్నాయా అంటే ఎగ్జిబిటర్ల నుంచి ఔననే సమాధానం వెంటనే రావడం లేదు.
తమిళ డబ్బింగ్ మూవీ ‘యూత్’ ప్రచారం కోసం టీమ్ భాగ్యనగరంలో తిష్ట వేసి నాన్ స్టాప్ గా మీడియాతో మాట్లాడుతోంది. బయటికి వెళ్లి వెరైటీ ప్రమోషన్స్ చేస్తోంది. ఉన్నంతలో డీసెంట్ బుకింగ్స్ ఉన్నాయి కానీ కింది స్థాయి కేంద్రాల్లో రెస్పాన్స్ అంతంత మాత్రమే. జివి ప్రకాష్ కుమార్ నటించిన మరో అనువాదం ‘హ్యాపీ రాజ్’ కు సౌండ్ ఎక్కువే చేస్తున్నా అది వసూళ్లుగా మారడం లేదు. కంటెంట్ మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అంతగా లేకపోవడం కొంత మైనస్సే.
హాలీవుడ్ మూవీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’కి ఏ సెంటర్స్ లో స్పందన బాగుంది. అది కూడా బార్కో, డాల్బీ సినిమా, ఎపిక్, లుక్సాన్ లాంటి ప్రీమియర్ స్క్రీన్లలో తప్ప బయట అంతగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో మాత్రం దీని ఎక్స్ పీరియన్స్ గురించి గొప్పగా చెబుతున్నారు. తెలుగు డబ్బింగ్ ఉన్నా ఆ సంగతి చాలా మంది జనాలకు తెలియనంత వీక్ గా ప్రమోషన్ జరిగింది. బిజినెస్ పరంగా పెద్దగా టార్గెట్స్ లేవు కాబట్టి ఇబ్బంది లేదు.
ఇక గత వారం నుంచి సునామి మొదలుపెట్టిన ‘దురంధర్ ది రివెంజ్’ రెండో వారంలోనూ ఆధిపత్యం కొనసాగుతోంది. వీకెండ్ దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ ఖాయమే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫలితం తేలిపోయినప్పటికీ వారాంతంలో మళ్ళీ బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. భారీ నెంబర్లు కాదు కానీ థియేటర్ ఫీడింగ్ కి సరిపడా కలెక్షన్స్ అయితే వచ్చేలా ఉన్నాయి. దీన్ని బట్టి రిజల్ట్ మారిపోదు కానీ కొంత ఊరట అయితే దక్కుతుంది. మొత్తానికి న్యూ రిలీజుల సౌండ్ తక్కువగానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates