తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఆంధ్రా వారిని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని తెలంగాణ వాదులు, ఇక్కడి రాజకీయ నాయకులు గొడవ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినీ జనాల మీద కూడా ఈ రకమైన దాడులు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ ఊపందుకున్నాక ఇలాంటి పరిణామాలు ఎక్కువ జరిగిన మాట వాస్తవం.
ఐతే తమ కుటుంబం చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చినపుడే ఈ రకమైన పరిస్థితులు చూసినట్లు సినీ నటుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ వేదికగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ చెన్నై కేంద్రంగా నడిచిన సంగతి తెలిసిందే. ఐతే తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో మొదలుపెట్టి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు తరలిరాగా.. కొన్నేళ్లకు చిరు కుటుంబం కూడా ఇక్కడికి వచ్చేసింది. అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ పవన్ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”మేం చెన్నైలో ఉండేవాళ్లం. ఫిలిం ఇండస్ట్రీ అక్కడే ఉండేది. మేమందరం ఏం నమ్మామంటే.. ఇది మా నేల, మా రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం అనుకున్నాం. చెన్నైలో మా అన్నయ్యకు సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఇంటితో పాటు ఆస్తులు అన్నీ అమ్మేసుకుని అందరం హైదరాబాద్‌కు వచ్చేశాం. కానీ కారణాలేమైనా కావచ్చు కానీ.. ఇది మీ ఊరు కాదు, మీ రాష్ట్రం కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నారు.
రాజకీయ నాయకుల వరకే ఈ గొడవ ఉంది.. శాసన సభ్యుల మధ్య ఈ గొడవ ఉందంటే దాన్ని వేరుగా చూసేవాళ్లం కానీ.. సగటు ఆంధ్ర పౌరులందరి మీదా దాని ప్రభావం కనిపించింది” అని పవన్ వ్యాఖ్యానించారు.
చిరు కుటుంబం 80వ దశకంలోనే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసింది. ఆ రోజుల్లోనూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ.. చిరు లాంటి అగ్ర కథానాయకుడు, ఆయన కుటుంబాన్ని హైదరాబాద్ నుంచి వెళ్లిపోమనే పరిస్థితి ఉందా అన్నది చర్చనీయాంశం. పవన్ వ్యాఖ్యల మీద ఇప్పటికే సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి.
కొందరు ఈ వ్యాఖ్యలను ఖండిస్తుంటే.. కొందరు పవన్ వాస్తవమే చెప్పాడని మద్దతుగా నిలుస్తున్నారు. కొన్ని నెలల ముందు కోనసీమ ప్రాంతానికి తెలంగాణ వారి దిష్టి తగిలిందన్న వ్యాఖ్యలతో పవన్ ఇక్కడ వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో మరోసారి ఆయన్ని తెలంగాణ వాదులు టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates