బాహుబలి-2 రికార్డు… ఇంకొన్ని రోజులే

తొమ్మిదేళ్ల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర మామూలు ప్రభంజనం సృష్టించలేదు. అప్పటిదాకా ఉన్న అన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులనూ ఆ సినిమా బద్దలు కొట్టేసింది. ఐతే ‘దంగల్’ సినిమాను చైనాలో రిలీజ్ చేయడం ద్వారా.. ఆ సినిమా ఓవరాల్ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టేయగలిగారు. ఆపై బాహుబలి-2 పేరిట ఉన్న వేరే రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలవుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘బాహుబలి-2’ రికార్డులన్నీ చెరిగిపోయాయి.

కానీ యుఎస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రాజమౌళి సినిమా నెలకొల్పిన రికార్డును మాత్రం మరే చిత్రం అధిగమించలేకపోయింది. ఇండియాలో అంటే టికెట్ల ధరలు పెరగడం, మార్కెట్ పరిధి విస్తరించడం వల్ల ‘బాహుబలి-2’ రికార్డులను వేరే సినిమాలు అధిగమించగలిగాయి కానీ.. యుఎస్‌లో కలెక్షన్లను డాలర్లలో కొలుస్తారు కాబట్టి ఆ సినిమా వసూళ్లను దాటడం మిగతా చిత్రాలకు చాలా కష్టమైంది.

‘బాహుబలి-2’ యుఎస్‌లో 22 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. రెండేళ్ల ముందు ప్రభాస్ ‘కల్కి’ చిత్రం ‘బాహుబలి-2’ రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. ఆ చిత్రం 18.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఐతే గత ఏడాది ‘దురంధర్’ చిత్రం ‘బాహుబలి-2’ను బీట్ చేసేలా కనిపించింది కానీ.. అది కూడా ఫుల్ రన్లో 20.65 మిలియన్ డాలర్ల దగ్గర ఆగింది. కానీ ‘దురంధర్-2’ మాత్రం పక్కాగా ‘బాహుబలి-2’ను బీట్ చేసేలా కనిపిస్తోంది.

ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే నార్త్ అమెరికాలో 19 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండబోతోందన్నది స్పష్టం. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో బాహుబలి-2ను అధిగమించడం లాంఛనమే. సెకండ్ వీకెండ్ అయ్యేసరికే ‘బాహుబలి-2’ రికార్డు బద్దలైనా ఆశ్చర్యం లేదు. మొత్తానికి యుఎస్‌లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా తొమ్మిదేళ్ల పాటు ‘బాహుబలి: ది కంక్లూజన్’ పేరిట ఉన్న రికార్డును ‘దురంధర్: ది రివెంజ్’ బద్దలు కొట్టబోతోందన్నమాట.