వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. మూడు భాషల్లో ఆఫర్లు వస్తున్నా, అవి రిలీజవుతున్నా హిట్టు మాత్రం పడటం లేదు. సంక్రాంతికి కార్తీ సరసన అన్నగారు వస్తారు చేసింది కానీ అదేమో దారుణంగా బోల్తా కొట్టింది. ప్రదీప్ రంగనాథన్ జోడిగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదలకు నిర్మాతలు పడరాని పాట్లు పడుతున్నారు కానీ మోక్షం దక్కడం లేదు.
ఇదిలా ఉండగా చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించే భారీ చిత్రంలో మెగాస్టార్ కూతురి పాత్రకు కృతి శెట్టిని అడిగారనే ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే ఆమె అంత సుముఖత చూపించకపోవడంతో ఆ ఛాన్స్ అనస్వర రాజన్ కు వెళ్లిందనే టాక్ కూడా ఉంది. ఇంకా ప్రారంభోత్సవం జరగని ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇది మిస్సయినా కృతి శెట్టి మరో బంపర్ ఆఫర్ తగిలిందట.
వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే ఎంటర్ టైనర్ లో వెంకీ భార్యగా కీర్తి సురేష్ లాక్ కాగా, కళ్యాణ్ రామ్ సతీమణిగా కృతి శెట్టిని ఫిక్స్ చేసుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. మాములుగా అనిల్ సినిమాల్లో హీరోయిన్ కి ప్రాధాన్యం ఉంటుంది. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తారు. మన శంకరవరప్రసాద్ గారు, సంక్రాంతికి వస్తున్నాంలో నయనతార, ఐశ్యర్య రాజేష్ లు ఎంత హైలైట్ అయ్యారో చూశాం. అవి బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి.
సో ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా కనక ఓకే అయితే కృతి శెట్టికి కూడా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటుంది. కాకపోతే వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ ముగ్గురూ తనకన్నా చాలా సీనియర్లు. వాళ్ళ ముందు ఉనికిని చాటుకోవడం ఒకరకంగా సవాల్ లాంటిది. అనిల్ ఇలాంటివి హ్యాండిల్ చేయడంలో దిట్ట కాబట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. జూలై నుంచి షూటింగ్ మొదలు కావొచ్చని అంటున్నారు. ఎంత లేట్ అయినా రిలీజ్ మాత్రం 2027 సంక్రాంతికి పక్కా జరిగిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates