దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ‘RRR’ విడుదలై అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయాయి. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఈ చిత్రం, ఆస్కార్ వరకు వెళ్లి చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర హీరోలను ఒకే తెరపై చూపించి రాజమౌళి ఒక అద్భుతాన్ని సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఇప్పటికీ ఈ సినిమా మేకింగ్, నటన గురించి గొప్పగా చర్చించుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ మరో రకంగా ఉండటం గమనార్హం.
ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ‘RRR’ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. జపాన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డుల నుంచి వెస్ట్రన్ ఆడియన్స్‌ను మెప్పించడం వరకు ఈ సినిమా ఒక సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. అయితే సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య జరుగుతున్న వార్ మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. సినిమాలో ఎవరి పాత్ర గొప్పది? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత దక్కింది? అనే పాత విషయాల మీదే ఫ్యాన్స్ ఇంకా కుస్తీ పడుతున్నారు.
సినిమా యూనిట్ సెలబ్రేషన్స్ పోస్ట్‌లు పెట్టినప్పుడల్లా ఈ గొడవలు మళ్ళీ మొదటికొస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో ‘మెయిన్ హీరో’ ఎవరు అనే చర్చ ఫ్యాన్ వార్స్ కు అసలు కారణంగా మారుతోంది. రాజమౌళి ఇద్దరి పాత్రలను రామరాజు, భీమ్ లాగా బ్యాలెన్స్ చేసినా, అభిమానులు మాత్రం తమ హీరోనే గొప్ప అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు గుర్తింపు వచ్చినప్పుడు కూడా, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలనే విషయంలో ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రపంచం మొత్తం ఈ సినిమాలోని ‘సినిమాటిక్ గ్రేట్‌నెస్’ను చూస్తుంటే, మనవాళ్లు మాత్రం పాత లెక్కలు తీయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఈ నాలుగేళ్లలో చరణ్, ఎన్టీఆర్ తమ తదుపరి ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. చరణ్ ‘గేమ్ చేంజర్’ తరువాత ‘పెద్ది’ సినిమాతో వస్తుంటే, ఎన్టీఆర్ ‘దేవర’, ‘వార్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేశాడు. ఇక నెక్స్ట్ డ్రాగన్ రానుంది. హీరోలు ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నా, గ్రౌండ్ లెవల్ లో మాత్రం ఫ్యాన్స్ మధ్య ఆ ‘RRR’ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. మరోవైపు రాజమౌళి తన తదుపరి చిత్రం ‘వారణాసి’ పనుల్లో నిమగ్నమై ఉంటే, ఫ్యాన్స్ మాత్రం ఇంకా 2022 నాటి ‘RRR’ సీన్ల దగ్గరే ఆగిపోయారు.
ఏదేమైనా ‘RRR’ అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డ్ మూవీ. ఇలాంటి మల్టీస్టారర్ మళ్ళీ రావడం అంత సులభం కాదు. ఇద్దరు హీరోలు తమ కెరీర్ లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ సినిమాను ఒక సెలబ్రేషన్‌లా చూడాలి తప్ప, గొడవలకు తావివ్వకూడదు. ఈ నాలుగేళ్లలో సినిమా ఎన్నో రికార్డులను దాటింది, మరి మన ఫ్యాన్స్ ఆ పాత ఆలోచనల నుంచి ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
