కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్లు ఎంత కీలకంగా మారుతున్నాయో చూస్తున్నాం. జనాలకు రీచ్ కావడం కోసం దర్శక నిర్మాతలు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. దురంధర్ లాంటివి పబ్లిసిటీ చేసుకోకపోయినా ఆడియన్స్ వాటికి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు కానీ అన్నింటికి ఇది సాధ్యపడటం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఏం జరిగిందో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇమేజ్ సైతం వీక్ కంటెంట్ ని కనీస స్థాయిలో నిలబెట్టలేకపోతోంది.
ఈ నేపథ్యంలో వచ్చే వారం ఏప్రిల్ 3న బైకర్ వస్తోంది. శర్వానంద్ దీని కోసం చాలా కష్టపడ్డాడు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ దీంతో సెకండ్ ఇన్నింగ్స్ బలంగా ఉంటాయనే కాన్ఫిడెన్స్ తో ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అన్ని చోట్లా కనిపిస్తున్నారు. కానీ జనాల మూడ్ ఇప్పుడు వేరేలా ఉంది. దురంధర్ ప్రభంజనం ఒకవైపు అయితే యుద్ధ ప్రభావం ఇంకోవైపు వాళ్ళను నలిపేస్తోంది. గ్యాస్ బుక్ చేస్తుంటే రావడం లేదు. రెండు బుకింగ్స్ మధ్య గ్యాప్ అంతకంతా పెంచేస్తున్నారు.
ఇంధనం కొరత వార్తలు విపరీతంగా వైరల్ కావడంతో పబ్లిక్ పెట్రోల్ బంకుల వైపు పరుగులు పెడుతున్నారు. కిలోమీటర్ల క్యూలు హైదరాబాద్ లాంటి నగరాల్లో కనిపిస్తున్నాయి. ఇవి పట్టణాలు, గ్రామాలకు విస్తరించడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ నేపథ్యంలో సామాన్యులు సినిమాలు చూసే మూడ్ లో ఉంటారా అంటే చెప్పలేం. ట్రంప్ వార్ ఆగిపోయింది, మేం గెలిచాం అని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి మాత్రం అతలాకుతలంగా ఉంది.
బైకర్ ఒకటే కాదు ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న అడివి శేష్ డెకాయిట్ కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడేలా ఉంది. సోషల్ మీడియాలో ఏదైనా హడావిడి చేద్దామంటే ట్వీట్లన్నీ దురంధర్, పెట్రోల్, ఎల్పిజితో నిండిపోతున్నాయి. అలాంటప్పుడు బైకర్, డెకాయిట్ మీద అటెన్షన్ తీసుకురావడం చాలా పెద్ద టాస్క్. రేపు రిలీజ్ కాబోతున్న చిన్న సినిమాలను ఇదే ప్రాబ్లమ్ వేధిస్తోంది. అందుకే వీలైనంత బజ్ ని పెంచేందుకు రకరకాల కసరత్తులు అయితే చేస్తున్నారు. చూడాలి ఈ అయోమయానికి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
