ఇలా ఐతే కంపెనీ నడవదు ప్రదీప్

అంగట్లో అన్నీ ఉన్నా సామెత యూత్ హీరో ప్రదీప్ రంగనాథన్ కు బాగా సూటవుతుంది. వరసగా రెండు హిట్లు డ్రాగన్, డ్యూడ్ తర్వాత మూడో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యిందో లెక్కబెట్టడం కష్టం. ఫైనల్ గా ఏప్రిల్ 3 అనౌన్స్ మెంట్ ఇచ్చి ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ తో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకటన కూడా ఇచ్చారు. తీరా చూస్తే కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏప్రిల్ 3 రావడం లేదని చెన్నై వర్గాల కథనం. కారణాలు లేకపోలేదు. ఓవర్సీస్ లో దురంధర్ ది రివెంజ్ ప్రభంజనం ఓ రేంజ్ లో ఉంది. ఇంకో రెండు వారాలకు పైగా నెమ్మదించే సూచనలు లేవు. దీనికి తోడు శర్వానంద్ బైకర్ కు మంచి రిలీజ్ దక్కుతోంది. ముందే చేసుకున్న ఒప్పందాల వల్ల తగినన్ని స్క్రీన్లు దొరుకుతున్నాయి. హాలీవుడ్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మీద పాజిటివ్ బజ్ చాలా ఎక్కువగా ఉంది.

దీనికి తోడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకున్న ఆర్థిక చిక్కులు ఇంకా తొలగిపోలేదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చివరి నిమిషం దాకా నానబెట్టి ఎగ్జిబిటర్లను ఇబ్బంది పెట్టడం కన్నా ముందే ఆగిపోతే బెటరని నిర్మాతలు భావించారట. నయనతార భర్త, సూర్య గ్యాంగ్ ఫేమ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఫాంటసీ డ్రామాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఎస్జె సూర్య ముఖ్యపాత్ర పోషించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.

ఇన్ని ఆకర్షణలు ఉన్నా సినిమా ఇలా బ్రేకులు వేసుకోవడం విచిత్రమే. తెలుగు డబ్బింగ్ కూడా సమాంతరంగా విడుదల చేసేందుకు టీమ్ ప్లానింగ్ లో ఉంది. నిర్మాణ సమయంలో మంచి  బజ్ తెచ్చుకున్న ఈ మూవీ క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళింది. దీనికి బడ్జెట్ ఏం తక్కువ కాలేదు. విఎఫెక్స్ గట్రా బలంగానే వాడారు. ఫ్లాపుల్లో ఉన్న హీరో సినిమా చిక్కుల్లో పడితే ఆశ్చర్యం లేదు కానీ ఇలా ప్రదీప్ రంగనాథన్ లాంటి క్రేజీ హీరో మూవీకి సమస్య రావడం విచిత్రమే.