ధురంధర్. . గుడ్డిగా నమ్మితే మునగడం పక్కా

గతంలో ‘బాహుబలి’ సినిమా బడ్జెట్ పరిధిని పెంచిన ట్రెండ్ చూశాం. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ భారీ బడ్జెట్, పాన్ ఇండియా అంటూ కోట్లు కుమ్మరించి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మధ్యలో కాంతర, హనుమాన్ లాంటి సినిమాల తరహాలో దేవుడి కనెక్షన్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుందనే ఒక సెంటిమెంట్ కూడా నడిచింది. ఇక పార్ట్ 2 సెంటిమెంటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ‘ధురంధర్’ సక్సెస్‌తో రన్ టైమ్ గట్టిగా ఉంటేనే ఆడియన్స్ థ్రిల్ అవుతారని కొందరు మేకర్స్ ఫీల్ అవుతున్నారట. అవసరం లేకున్నా అదే దారిలో వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. 

​సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైతే చాలు, అది అందరికీ వర్కవుట్ అవుతుందన్న భ్రమలో చాలావరకు ఓ వర్గం దర్శకనిర్మాతలు ట్రాప్ లో పడిపోతుంటారు. మొన్న యానిమల్, పుష్ప 2 రన్ టైమ్ విషయంలో భరోసా ఇవ్వగా ఇప్పుడు, ధురంధర్ 2 ఆ కాన్ఫిడెన్స్ ని పెంచుతోంది. మూడు గంటలకు పైగా నిడివి ఉన్నా ఏమి కాదనే నమ్మకాన్ని ఇచ్చింది. దీంతో ఇప్పుడు మెజారిటీ దర్శకులు తమ సినిమాలకు కూడా అదే ఫార్ములా సెట్ అవుతుందని భావిస్తున్నారు. కానీ ప్రతి కథకు మూడు గంటల రన్ టైమ్ అవసరం ఉండదు. 

బలమైన కంటెంట్ లేనప్పుడు అనవసరంగా నిడివి పెంచడం అనేది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగిలేలా చేస్తుంది. పక్కవారిని చూసి వాత పెట్టుకున్న చందంగా ఈ ట్రెండ్ మారే ప్రమాదం ఉంది. ఇండస్ట్రీలో తరచుగా ఈ రన్ టైమ్ విషయంలో దర్శకుడికి, ఎడిటర్‌కు మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతుంటాయి. ఎడిటింగ్ టేబుల్ మీద అనవసరమైన సీన్లను తీసేయమని ఎడిటర్ చెబితే, సినిమా నిడివి ఎక్కువగా ఉంటేనే ‘గ్రాండ్‌’గా ఉంటుందనే ధోరణి దర్శకుల్లో పెరుగుతోంది. 

దీనివల్ల షూటింగ్ సమయంలో తీసిన ఎక్స్‌ట్రా ఫుటేజ్ వల్ల నిర్మాతపై ఊహించని బడ్జెట్ భారం పడుతోంది. అవసరం లేకున్నా సీన్లు తీయడం, ఆ తర్వాత ఎడిటింగ్‌లో వాటిని తొలగించడం వల్ల శ్రమ, డబ్బు రెండూ వృథా అవుతున్నాయి. కంటెంట్ మీద నమ్మకం లేనప్పుడే ఇలాంటి ప్రయోగాలు రిస్క్‌లో పడేస్తాయి. ​మార్పు ఉండటం మంచిదే కానీ, అది కేవలం ట్రెండ్‌ను అనుసరించడం కోసమే అయితే మాత్రం ఫలితం దారుణంగా ఉంటుంది.

​సినిమా సక్సెస్‌కు అసలైన సూత్రం ఎంగేజ్‌మెంట్. కథలో దమ్ముంటే రెండు గంటల సినిమా అయినా అద్భుతాలు సృష్టిస్తుంది. నిడివి పెంచడం వల్ల కథనం సాగదీసినట్లు అనిపిస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. యానిమల్, ధూరందర్ వంటి సినిమాల్లో ఆ నిడివికి తగ్గ ఎమోషన్ ఉంది కాబట్టి జనం ఆదరించారు. కానీ ప్రతి సినిమాను అదే కోణంలో చూడలేం. రొటీన్ ఫార్ములాను వదిలేసి కొత్తగా ప్రయత్నించడం వేరు, ఎవరో హిట్ కొట్టారని అదే పద్ధతిని ఫాలో అవ్వడం వేరు. ఈ విషయంలో సరైన అవగాహన లేకపోతే ఇండస్ట్రీలో మునిగిపోయిన వారి జాబితాలో చేరాల్సి వస్తుంది.