హరీష్‌కు ఛాన్సిచ్చేదెవరు?

‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా కన్ఫమ్ అయింది దర్శకుడు హరీష్ శంకర్‌కు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇటు హరీష్ శంకర్.. అటు పవన్ అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘గబ్బర్ సింగ్’ కలయికలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అనుకున్నారు. వీరి కలయికలో ముందు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా అనుకున్నారు. తర్వాత ‘తెరి’ రీమేక్ తెరపైకి వచ్చింది. 

చివరికేమో సొంత కథతోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే వేరే సినిమాను లైన్లో పెట్టాడు హరీష్. కానీ ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అయింది. చివరికి ఫస్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన ఐదేళ్ల తర్వాత కానీ సినిమా రాలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన సినిమా కాస్తా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం అందించలేదు. ఈ సినిమా నిర్మాతలకు పెద్ద నష్టమే మిగిల్చేలా కనిపిస్తోంది. అదే సమయంలో హరీష్ శంకర్‌ కెరీర్‌కు కూడా గట్టి దెబ్బ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందుకు కదలని సమయంలో హరీష్ శంకర్ తన స్టయిల్లో ‘రైడ్’ సినిమాను ‘మిస్టర్ బచ్చన్’గా రీమేక్ చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయింది. హరీష్ పెన్నులో పవర్ తగ్గిందని అప్పుడే చాలా కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో విమర్శలు మరింత పెరిగాయి.

పవన్‌ను అభిమానులు మెచ్చేలా ప్రెజెంట్ చేయడం వరకు ఓకే కానీ.. కథా కథనాల విషయంలో హరీష్‌కు మైనస్ మార్కులే పడ్డాయి. సినిమా రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్లో ఇదే విషయమై హరీష్ వ్యంగ్యంగా స్పందించాడు. పవన్‌ను అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశానని.. కథాకథనాలు అద్భుతంగా ఉంటాయని ఆశించిన నిరాశ పడి ఉంటే సారీ అని చెబుతూ, తనకు వచ్చింది ఇదే అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. 

తాను కొత్త కథలు రాయలేనని.. టేకింగ్ కూడా రొటీన్ టెంప్లేట్లోనే ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు హరీష్. ‘మిస్టర్ బచ్చన్’తో పోలిస్తే కంటెంట్ పరంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మెరుగే అయినప్పటికీ.. బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఇది ఫెయిల్యూరే. కొందరు స్టార్లు ఇప్పుడు సగటు కమర్షియల్ ఫార్మాట్లలో సినిమాలు చేయడానికి ఇష్టపడట్లేదు. ఏదైనా భిన్నంగా, పెద్దగా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండు ఫెయిల్యూర్లు ఇచ్చిన హరీష్‌తో జట్టు కట్టే హీరో ఎవరు.. పెట్టుబడి పెట్టే నిర్మాతలెవరు అన్నది చూడాలి.