మళ్లీ పెళ్లి చేసుకుంటా: నిహారిక

సెలబ్రిటీలకు విడాకులు, రెండో పెళ్లి ఈ రోజుల్లో సాధారణ విషయాలుగా మారాయి. టాలీవుడ్‌లోనూ ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల నిహారిక వివాహ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న ఆమె, మూడు సంవత్సరాలకే విడిపోయింది. అప్పటి నుంచి నిహారిక సింగిల్‌గా జీవిస్తోంది.

అయితే తాను మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేకపోలేదని నిహారిక తెలిపింది. కొన్ని సంవత్సరాలు నటిగా ప్రయత్నించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిర్మాతగా ఆమె తొలి సినిమా కమిటీ కుర్రోలు మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘రాకాస’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన నిహారికకు రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ, తాను మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నా, ప్రస్తుతం ఆ విషయంపై ఆలోచించడం లేదని చెప్పింది.

ఇక తన అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వారి లవ్ స్టోరీ గురించి తాను నాలుగేళ్ల తర్వాతే తెలుసుకున్నానని చెప్పింది. “వాళ్ల గురించి ముందే నాకు తెలిసిందనే వార్తలు నిజం కావు. అన్నయ్యకు ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్నేహితులు లేరు. అందుకే ఆ విషయం రహస్యంగా ఉండిపోయింది” అని నిహారిక తెలిపింది.

“మా అన్నను అందరూ ఇంట్రోవర్ట్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అలా కనిపిస్తాడంతే. అతను ఒక రౌడీ. నన్ను బాగా ఏడిపిస్తాడు” అంటూ సరదాగా చెప్పింది. ఒకసారి వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకకు లావణ్య రావడం చూసి, వాళ్ల మధ్య ఏదో ఉందని అర్థమైందని తెలిపింది.

సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి కూడా నిహారిక స్పందించింది. ట్రోల్ చేయడం చాలామంది తమ హక్కుగా భావిస్తున్నారని, అలాంటి వారిలో ఒకరికి శిక్ష పడితే మిగతావారికి బుద్ధి వస్తుందని వ్యాఖ్యానించింది.

‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.