బాలీవుడ్.. కక్కలేక మింగలేక

‘బాహుబలి’ని చూసి తెలుగు ప్రేక్షకులతో పాటు మన ఫిలిం ఇండస్ట్రీ ఎంతగా గర్వించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాలీవుడ్‌ను చాలా తక్కువగా చూసేవారన్నది వాస్తవం. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా తలెత్తుకునేలా చేసిందా చిత్రం. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాడ జక్కన్న. మరోవైపు ‘పుష్ఫ’ సినిమా సైతం తెలుగు సినిమా వైపు అందరూ చూసేలా చేసింది.

ఇక కేజీఎఫ్, కాంతార లాంటి చిత్రాలకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచాయి. ఇలా గత దశాబ్ద కాలంలో సౌత్ సినిమాల ధాటికి రేసులో వెనుకబడిపోయిన బాలీవుడ్.. మళ్లీ తలెత్తుకుని నిలిచే సందర్భం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఇలాంటి సమయంలో ‘దురంధర్’ అనే సినిమాను అక్కడి వాళ్లు గర్వకారణంగా భావించాలి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలన వసూళ్లు రాబట్టింది. దీని సీక్వెల్ ఇండియన్ బాక్సాఫీస్‌లో అన్ని వసూళ్ల రికార్డులనూ బద్దలు కొట్టే దిశగా సాగుతోంది.

చాలా ఏళ్ల నుంచి ఇండియన్ సినిమాలో తమ ఆధిపత్యాన్ని చాటుతున్న సౌత్ ఇండస్ట్రీకి ఇది మా సమాధానం అని.. బాలీవుడ్ ఓజీ అని చెప్పుకోవడానికి అక్కడి వాళ్లకు అవకాశం దక్కింది. కానీ బాలీవుడ్ మాత్రం ఈ ఛాన్సును ఉపయోగించుకోవట్లేదు. ఓవైపు రాజమౌళి, శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్లు.. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ సూపర్ స్టార్లు ఈ సినిమాను కొనియాడుతుంటే బాలీవుడ్ గప్‌చుప్ అని ఉండిపోయింది.

‘దురంధర్’ రిలీజైనపుడు హృతిక్ రోషన్ లాంటి ఒకరిద్దరు స్టార్లు ఇది ప్రాపగండా ఫిలిం అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఈ చిత్రాన్ని పొగిడారు. కానీ ‘దురంధర్-2’కు వచ్చేసరికి ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇందులో రాజకీయ అంశాలను పక్కన పెట్టి క్రాఫ్ట్‌ను ప్రశంసించవచ్చు. పెర్ఫామెన్సులు, టేకింగ్ గురించి మాట్లాడొొచ్చు. ఇది సాధించిన విజయం గురించి గొప్పగా మాట్లాడొచ్చు. కానీ ‘దురంధర్-2’ను పొగిడితే పొలిటికల్‌గా ఒక స్టాండ్ తీసుకున్నట్లవుతుందని, తమ స్థాయి తగ్గిపోతుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. బాలీవుడ్ జనాలెవరూ ఈ సినిమా గురించి స్పందించడం లేదు.

బాలీవుడ్లో ఎక్కువగా బీజేపీ, హిందూ వ్యతిరేక భావజాలంతో ఉంటారన్నది ఓపెన్ సీక్రెట్. బీజేపీని, హిందుత్వాన్ని టార్గెట్ చేస్తే అది గొప్పలా ఫీలవుతారు. అప్పుడు ప్రాపగండా అంటూ ఏమీ ఉండదు. కానీ ఆ పార్టీకి, హిందుత్వానికి అనుకూలంగా ఉంటే మాత్రం ప్రాపగండా అయిపోతుంది. ఈ భావనతోనే ‘దురంధర్-2’ పొగడ్డానికి బాలీవుడ్ జనాలకు మనసు రావట్లేదు. ఈ కారణంగానే బాలీవుడ్ గర్వపడే సినిమా వచ్చినా దాన్ని ఓన్ చేసుకోవట్లేదు అక్కడి వాళ్లు.