టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్ అనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ నుంచి గట్టి పోటీ ఉన్నా సరే.. అతను చేసే సినిమాల సంఖ్య, వాటి రేంజ్ ప్రకారం చూస్తే తమన్‌కే అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే. ఐతే చాలా ఏళ్ల నుంచి గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ.. తమన్ అందుకు తగ్గ గౌరవం దక్కించుకోలేకపోతున్నాడనే చర్చ జరుగుతూ ఉంటుంది. అందుక్కారణం.. తన మీద ఉన్న ‘కాపీ’ ముద్ర.
వేరే పాటలను అనుకరించడం.. తన పాటలనే మళ్లీ రిపీట్ చేయడం.. ఒకే రకమైన సంగీతంతో మొహం మొత్తేలా చేయడం ద్వారా తమన్ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు అతను అందించిన బీజీఎం కూడా రొటీన్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐతే తమన్ ఈ కామెంట్లేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. తన గురించి ‘కాపీ’ విమర్శలు వచ్చినపుడల్లా తమన్ ఎదురుదాడి చేస్తుంటాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు.. జనాలకు వేరే సంకేతాలు ఇస్తున్నాయి. ‘రాజాసాబ్’ సినిమాలో హిందీ పాట ‘నాచే నాచే’ను రీమిక్స్ చేయడం వల్ల నిర్మాతకు గట్టి దెబ్బే తగిలింది. ఇది హిందీ పాటకు రీమిక్స్ అయినప్పటికీ.. ఒరిజినల్ సాంగ్ కూడా ఫారిన్ మ్యూజిక్ నుంచి తీసుకున్నది కావడం.. వాళ్లు కాపీ రైట్ వేస్తే నిర్మాత కోట్ల రూపాయలు పరిహారం కింద చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వార్తలు వచ్చాయి. దీని గురించి తమన్‌ను అడిగితే.. సంగీత దర్శకులు ఫారిన్ మ్యూజిక్‌ను ఎలా తీసుకుంటారో పూసగుచ్చినట్లు చెప్పేశాడు.
ఫారిన్ మ్యూజిక్ లైబ్రరీస్‌లో ‘స్లైస్’ అని ఉంటాయని.. అందులో కొన్ని పెయిడ్ ఉంటే, కొన్ని ఫ్రీగా ఉంచుతారని.. కొన్నిసార్లు ఫ్రీ మ్యూజిక్ అని తీసుకుంటే అవి పాపులర్ అయ్యాక వాటిని పెయిడ్‌గా మార్చి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తుంటారని తమన్ వివరించాడు.
‘నాచే నాచే’ పాట విషయంలో కూడా అలాగే జరిగిందన్నట్లుగా మాట్లాడాడు. ఐతే ఈ వివరణ ఏ ఉద్దేశంతో తమన్ ఇచ్చాడో కానీ.. ఇలా ఫారిన్ మ్యూజిక్ లైబ్రరీల నుంచి మన సంగీత దర్శకులు కంటెంట్ తీసుకుంటారని.. తాను ఆ పని రెగ్యులర్‌గా చేస్తానని తమన్ ఫ్లోలో అసలు నిజాలు చెప్పేశాడు. దీని మీద యథావిధిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
