ధురంధర్ దర్శకత్వంలో బన్నీ తారక్ మల్టీస్టారర్?

ఆదిత్య ధర్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. తొలి సినిమా ‘యురి’తోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన ఆదిత్య.. రెండో చిత్రం ‘దురంధర్’తో పెను సంచలనమే సృష్టించాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా.. రిలీజ్ ముంగిట పెద్దగా చర్చల్లో లేదు. కానీ రిలీజయ్యాక మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఏకంగా రూ.1400 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ పండిట్లను విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు ‘దురంధర్-2’ అంతకుమించి ప్రకంపనలు రేపేలా సాగుతోంది.

మొన్న సాయంత్రం ప్రిమియర్లతో మొదలైన ఈ సినిమా ప్రభంజనం.. చాలా రోజుల పాటు సాగేలా కనిపిస్తోంది. తొలి రోజు ఆల్ టైం రికార్డు వసూళ్లు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకుంటే ఆశ్చర్యమేమీ లేదు.

మరి ఈ సినిమా తర్వాత ఆదిత్య ఏ హీరోతో జట్టు కడతాడు.. ఎలాంటి సినిమా తీస్తాడు అనే విషయంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘దురంధర్-2’ రిలీజ్ కావడానికి ముందు దీనికి కొనసాగింపుగా ఇంకో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఈ మూవీలో తేల్చేశాడు. మూడో పార్ట్‌కు లీడ్ ఏమీ ఇవ్వలేదు.

కాబట్టి ఆదిత్య కొత్త సినిమా చేయబోతున్నట్లే. గతంలో అతను టాలీవుడ్ సూపర్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌‌లతో సినిమా చేసే ఆలోచన చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనదగ్గ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ కోసం బన్నీతో చర్చలు కూడా జరిపాడు. ఇందులో బన్నీదే ప్రధాన పాత్ర కాగా.. తారక్ కూడా మరో ప్రత్యేక పాత్రలో నటిస్తాడని ప్రచారం జరిగింది.

కానీ ఏవో కారణాలతో కార్యరూపం దాల్చలేదు. బన్నీ చాలా మంది దర్శకులతో కథా చర్చలు జరుపుతుంటాడు. కానీ తనకు ఏమాత్రం అసంతృప్తి అనిపించినా, అపనమ్మకం కలిగినా ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లడు. బన్నీ కెరీర్లో చేసిన సినిమాలతో పోలిస్తే కొంత కాలం కథా చర్చలు జరిపాక క్యాన్సిల్ చేసిన సినిమాలే ఎక్కువ. అందులో ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ కూడా ఒకటి.

కానీ ఇప్పుడు ‘దురంధర్’లో ఆదిత్య పనితనం చూశాక అతడితో జట్టు కట్టాలని బన్నీ ఉవ్విళ్ళూరుతుంటాడనడంలో సందేహం లేదు. ‘దురంధర్-2’కు బుధవారం సాయంత్రం ప్రిమియర్ పడడం ఆలస్యం షో చూసేసి వెంటనే ఆదిత్య అండ్ టీంను ఆకాశానికెత్తేస్తూ పోస్టు కూడా పెట్టాడు బన్నీ.

తద్వారా ఆదిత్యతో పని చేయడానికి తన ఆసక్తిని చూపించినట్లే. మరోవైపు తారక్ సైతం ‘దురంధర్-2’ను కొనియాడుతూ పోస్టు పెట్టాడు. కాబట్టి అతడికీ ఆదిత్యతో పని చేయడం సమ్మతమే అన్నట్లుంది. బన్నీ, తారక్ ఇప్పుడు ఏ రేంజిలో ఉన్నారో, వాళ్లిద్దరూ ఎలాంటి పెర్ఫామర్లో, వాళ్ల రీచ్ ఏంటో తెలుసు కాబట్టి ఆదిత్య కూడా ఈ ఇద్దరితో పని చేయడానికి ఆసక్తిగానే ఉంటాడనే భావించవచ్చు. అన్నీ కుదిరితే వీరి కలయికలో మెగా మూవీ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం.