అల్లు వారి దాల్బీ విందుకు ముహూర్తం కుదిరింది

హైదరాబాద్ సినీ ప్రియులకు శుభవార్త. సరికొత్త వెండితెర వినోదాన్ని పంచేందుకు ఇక్కడ కొత్త ఆకర్షణ సిద్ధమైంది. ఆసియాలోనే అతి పెద్దదైన దాల్బీ స్క్రీన్‌లో సినిమా చూసే అవకాశం అతి త్వరలో హైదరాబాద్ సినీ ప్రేమికులకు దక్కబోతోంది. కోకాపేటలో అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రెండు నెలల ముందే ఈ మల్టీప్లెక్స్‌కు సాఫ్ట్ లాంచ్ జరిగింది. 

కానీ పూర్తి స్థాయి ప్రారంభోత్సవం చేయలేదు. సంక్రాంతికి అనుకున్నారు కానీ కుదరలేదు. పనులు పూర్తి కావడం, అనుమతులు రావడంలో ఆలస్యం జరిగింది. ఐతే ఎట్టకేలకు అన్ని పనులూ పూర్తి చేసుకుని ఈ నెల 12న ప్రారంభోత్సవం జరుపుకోవడానికి అల్లు సినిమాస్ సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

అల్లు సినిమాస్‌లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉండగా.. అందులో స్క్రీన్-1 చాలా స్పెషల్. ఆసియాలోనే ఎక్కడా లేనంత పెద్ద దాల్బీ స్క్రీన్ ఇదే. ఏకంగా 75 అడుగుల ఎత్తుతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఆడిటోరియం కెపాసిటీ 600 పైనే కావడం విశేషం. హైదరాబాద్‌లో ఐమాక్స్ లేదని సినీ ప్రియులు ఫీలవుతుంటారు. దాని కోసం కూడా సన్నాహాలు జరుగుతుండగా.. ఐమాక్స్‌కు దీటైన, కొన్ని విషయాల్లో దాన్ని మించిన ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే భారీ దాల్బీ స్క్రీన్ రెడీ అవడం సినీ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే. 

ఈ నెల 12న అల్లు సినిమాస్ ఆరంభం అవుతున్నప్పటికీ.. దాల్బీ స్క్రీన్ మాత్రం 18 నుంచి అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. ఆ రోజు దురంధర్-2, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ సినిమాలకు పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్నాయి. ‘దురంధర్-2’కు ఆల్రెడీ షోలు కూడా కన్ఫమ్ అయినట్లు సమాచారం. ‘ఉస్తాద్’ షోలు కూడా పడే అవకాశాలున్నాయి. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం గురించి ఈ రోజో, రేపో అధికారిక ప్రకటన రావచ్చు.