ఫ్యామిలీస్ వైపు రూటు మార్చిన సూర్య

పేరుకి కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. గత కొన్నేళ్లుగా సక్సెస్ లేక ఎంతగా స్ట్రగుల్ అవుతున్నాడో తెలిసిందే. రెట్రో దారుణంగా పోయింది. కంగువ నష్టాల దెబ్బకు నిర్మాత కొంత కాలం కనిపించలేదు. జై భీం, ఆకాశం నీ హద్దురాకు గొప్ప ప్రశంసలు దక్కినా అవి ఓటిటి రిలీజులు కావడంతో తన బాక్సాఫీస్ స్టామినా బయట పడలేదు. అంతకు ముందు బందోబస్త్, ఎన్జీకె, గ్యాంగ్ అన్నీ వరుసబెట్టి ఫ్లాపులే. ఒక్క 24 మాత్రమే మంచి విజయం సాధించింది. ఎన్ని జానర్లు చేస్తూ వచ్చినా సూర్య దూరంగా ఉంటూ వచ్చిన సెక్షన్ కుటుంబ ప్రేక్షకులు. ఫైనల్ గా దాన్ని చేశాడు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టైటిల్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. చిన్నపిల్లాడిని ఛాతి మీద ఎత్తుకుని సూర్య ఇచ్చిన స్టిల్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన వైనం స్పష్టంగా కనిపించింది.

నలభై వయసు ఉన్న వ్యక్తికి, ఇరవై ఏళ్ళ అమ్మాయికి మధ్య ఏర్పడిన స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ ఈ కథ ఉంటుందని గతంలోనే వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో పాటు సెంటిమెంట్, ఎమోషన్స్, డ్రామా అన్ని తగిన పాళ్ళలో బాలన్స్ చేస్తూ విశ్వనాథ్ అండ్ సన్స్ మెప్పిస్తుందని చెప్పుకువచ్చారు.

విశ్వనాథ్ అంటే కథ ప్రకారం సూర్య తండ్రి పాత్రనా లేక సూర్యనా అనేది ట్రైలర్ వచ్చాక క్లారిటీ వస్తుంది. సినిమాని జూలైలో విడుదల చేయబోతున్నారు. దీనికన్నా ముందు సూర్య మరో మూవీ కరుప్పు రిలీజ్ కావాల్సి ఉంది. గత ఏడాది ద్వితీయార్థం నుంచి ఇది వాయిదా పడుతూనే ఉంది.

ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ అయితే ఏప్రిల్ లో రావాలి లేదా వేసవి తర్వాత చూసుకోవాలి. కరుప్పు డేట్ కన్ఫర్మ్ అయ్యాకే విశ్వనాధ్ అండ్ సన్స్ మీద క్లారిటీ వస్తుంది. అతి తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారో.