పైరసీ పెట్రేగిపోతుంటే చూస్తూ ఉంటారా

హీరో శ్రీవిష్ణు ఈరోజు పెద్ద బాంబు వేశారు. విష్ణు విన్యాసం డిసెంబర్ లోనే పార్టులుగా లీకయ్యిందని, అందుకే హడావిడిగా షూటింగ్ పూర్తి చేసి త్వరగా థియేటర్లకు తీసుకొచ్చామని అన్నాడు. పైరసీ చేసినవాళ్లు నిర్మాతను చాలా బెదిరించారని, రీల్ రీల్ కు డబ్బులు డిమాండ్ చేశారని, అయినా సరే ఆయన ధైర్యంగా పోరాటాన్ని సాగించారని వివరించాడు.

చెన్నై కేంద్రంగా జరిగిన ఈ లీకు ప్రస్తుతం పోలీస్ కేసులో ఉంది కాబట్టి త్వరలోనే వివరాలు బయటికి వస్తాయని అన్నారు. ఫిబ్రవరి దాకా ఈ తతంగం కొనసాగుతూనే వచ్చిందని, అందుకే ఇరవై రోజుల షెడ్యూల్ ని వారంలోనే పూర్తి చేసి ఈ సినిమా అందించామని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ సీరియస్ గా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పైరసీ గురించి ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు ఇక ఆన్ లైన్ లో కొత్త సినిమా ప్రింట్లు రావని అందరూ భుజాలు ఎగరేసుకున్నారు. కానీ రవి నిర్వహించే యాప్స్ ఆగిపోయాయి కానీ పైరసీ అంతరించిపోలేదు. కొనసాగుతూనే ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే అత్తారింటికి దారేది నుంచి విష్ణువిన్యాసం దాకా ఎన్నో సినిమాలు బిఫోర్ రిలీజ్ లీక్ బారిన పడ్డాయి. విజయ్ దేవరకొండ టాక్సీవాలా రఫ్ కాపీ ముందే బయటికి వచ్చేయడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే.

వీటి మూలాలు ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. థియేటర్లకు వచ్చాక పైరసీ జరిగితే అదో రకం. కానీ ఇలా విడుదలకు ముందు అంటే మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం చాలా ఉంది. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి అగ్ర దర్శకులు ఇలాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఫోటో లీక్ వచ్చినా కాపీ రైట్స్ వేసి తీయించేస్తారు.

ఇకపై చిన్న సినిమాలు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడిటింగ్ రూమ్ నుంచి ల్యాబ్ దాకా ప్రతిదీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ఉండాలి. లేదంటే ఎక్కడో చెన్నైలో ఉన్న వాడు హైదరాబాద్ లో ఉన్న నిర్మాతను బెదిరించడం ఏమిటి. ఎలాగైనా సరే దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇండస్ట్రీ, ప్రభుత్వాలు పూనుకోవాలి.